అవునా...? వేల కోట్ల నష్టానికి కారణమయ్యే పైరసీ చిన్న నిర్మాతలు, చిన్న హీరోలకు మేలు చేస్తోందా? అంటే.. అవుననే అనాలి. తమిళ్ రాకర్స్ మాఫియా అయినా, ఐ బొమ్మ, మూవీ రీల్స్ అయినా వీరంతా చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలకేనా గ్లోబల్ వైడ్ రీచ్ ఉండేది.. ఇప్పుడు కనీసం లోకల్ మార్కెట్లో కూడా అంతగా ఎవరికీ తెలియని చిన్న హీరోని గ్లోబల్ వైడ్ హీరోని చేస్తున్నది పైరసీ మాఫియా కాదా?
తేజ సజ్జా లాంటి చిన్న హీరో హనుమ్యాన్ తో పాన్ ఇండియా హిట్టు కొట్టాడు కాబట్టి, అందరికీ తెలుసు కానీ ఇతర చిన్న హీరోలు ప్రపంచానికి తెలిసేదెలా? అందుకే పైరసీలో చిన్న సినిమాల్ని వరల్డ్ వైడ్ చూసేందుకు వీలుంది కాబట్టి మన హీరోలను పైరసీ ఇతర ప్రపంచానికి సులువుగా కనెక్ట్ చేస్తోంది. అంటే సినిమా పైరసీకి గురై పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు నష్టపోవచ్చేమో కానీ, హీరోలు కాదు.
సినిమా రిలీజైన గంటలోనే చిన్న సినిమా అయినా, చిన్న హీరో అయినా ప్రపంచవ్యాప్తంగా ఉచిత సినిమాని చూడటం ద్వారా ప్రజలు ఆదరిస్తున్నారు. ఉచితంగా లభిస్తే ఫినాయిల్ అయినా తాగే రకాలు, ఫ్రీగా సినిమా చూసే ఛాన్స్ వస్తే చూడకుండా ఉంటారా? కృష్ణానగర్, ఫిలింనగర్ లో బీటెక్ బాబుల్ని అడగండి.. పైరసీలో ఎలా డౌన్ లోడ్ చేయాలో.. ఎలా ఉచితంగా సినిమాలు చూడాలో..! వీళ్లంతా దేశోద్ధారకులు.