మీటూ ఉద్యమంలో భాగంగా చాలా మంది నటీమణులు తమపై వేధింపుల ప్రహసనం గురించి ఆరోపించారు. కొందరు కేసులు వేయగా వీటిపై కోర్టుల పరిధిలో విచారణ సాగింది. కానీ చాలా వరకూ కేసులు నిరూపితం కాలేదు. పలువురు నటులు నిర్ధోషులుగా బయటపడ్డారు. నానా పటేకర్ లాంటి అగ్రెస్సివ్ పర్సనాలిటీ కోపం, తిట్టడం కొట్టడం అలవాటు కారణంగా తనూశ్రీ లాంటి నటి వేధింపుల ఆరోపణలు చేసిందని ఆర్జీవీ లాంటి కొందరు మాత్రమే ఓపెన్ గా ప్రకటించారు. ఈ కేసులో నానా పటేకర్ అతడు చెప్పినట్టే నిర్ధోషిగా బయటపడ్డారు. కానీ మీడియా ప్రచారం కారణంగా నానా పటేకర్ నిజంగా తనూశ్రీతో అసభ్యంగా ప్రవర్తించి ఉంటాడని, తప్పు చేసాడని బయటి ప్రపంచం భావించింది. మీటూ ఉద్యమం నాటి చాలా కేసులు వీగిపోవడంతో నటీమణులు కొన్నిసార్లు పగ ప్రతీకారం కక్షలతో కూడా లైంగిక వేధింపుల్ని అడ్డు పెట్టుకుని ఫేక్ కేసులు పెట్టారని పలువురు విశ్లేషించారు.
ఇప్పుడు అలాంటి మరో కేసు బయటపడింది. విద్యాబాలన్ 2020 మూవీ షేర్ని సెట్స్ లో సహనటిపై విజయ్ రాజ్ అనే నటుడు వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. అతడిపై కేసులు నమోదయ్యాయి. కానీ కోర్టుల పరిధిలో దీనిని నిరూపించడంలో సదరు నటీమణి విఫలమైంది. మినిమం ఆధారాల్ని కూడా ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయింది. సీసీ ఫుటేజీల్లోను అనుచితంగా ఏదీ కనిపించలేదు అని న్యాయమూర్తులు కేసును కొట్టి పారేసారు.
అయితే నానా పటేకర్ కానీ, విజయ్ రాజ్ కానీ తమపై వచ్చిన ఆరోపణల కారణంగా ఇండస్ట్రీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. కొన్నేళ్ల పాటు అవకాశాల్లేక ఖాళీగా కూచోవాల్సి వచ్చింది. ఉపాధి పోయింది. నిర్ధోషులుగా బయటపడ్డాక ఈ విషయాలను తలచుకుని బాధపడటం తప్ప చేసేదేమీ లేకుండా పోయింది. పరిశ్రమలో వేధింపులు లేవు అని చెప్పడం లేదు. కానీ కొన్నిసార్లు వ్యక్తిగత కక్షల కారణంగా తప్పుడు కేసులు వేయడం కెరీర్ ని ప్రభావితం చేసి చివరికి జీవితాలను నాశనం చేస్తోంది. చాలా వరకూ సహచరులతో వ్యక్తిగత కక్షల కారణంగా పెట్టిన కేసులేనని విచారణలో తేలుతోంది. సెట్స్ లో పది మంది పని చేసేప్పుడు ఒకరితో ఒకరికి సరిపడక పోవడం, కొన్ని కామెంట్ల కారణంగా హర్ట్ అయి తప్పుడు వేధింపుల కేసులు వేస్తే దానిని గుర్తించేది ఎవరు?