గగుర్పాటుకు గురి చేసే యాక్షన్ విన్యాసాలు, వండర్ అనిపించే సాహసాలతో అలరించేందుకు వస్తున్నాడు టామ్ క్రూజ్. అతడు నటించిన మిషన్ ఇంపాజిబుల్ : ది ఫైనల్ రికనింగ్ భారతదేశంలో దాదాపు 3000 థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా ఓపెనింగ్ డే 15 కోట్ల వసూళ్లతో గత రికార్డును బ్రేక్ చేసింది. దాదాపు ఒక లక్ష టికెట్లు ఇప్పటికే అమ్ముడు కాగా, బుకింగులు ఓపెనైతే ఈ వసూళ్ల రేంజు మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మిషన్ ఇంపాజిబుల్ తెలుగు, తమిళం, హిందీ సహా పలు స్థానిక భాషల్లో విడుదలవుతుండడంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఓపెనింగ్ డే ఈ సినిమాని చూడాలన్న కసి కనిపిస్తోంది.
మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ ఈ సిరీస్ లో వచ్చిన చివరి సినిమా. డెడ్ రికనింగ్ 12.5 కోట్ల ఓపెనింగులతో మొదలై 106 కోట్లు ఇండియాలో వసూలు చేసింది. ఇప్పుడు ఎంఐ సిరీస్ చివరి సినిమా ఈ రికార్డును బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఎం.ఐ సిరీస్ లో ఇదే చివరి సినిమా కావడంతో అభిమానులు ఘనంగా ఫేర్ వెల్ నిర్వహిస్తారని అంచనా. ఇంతకుముందు టోక్యో, కేన్స్ లో ఈ సినిమా ప్రదర్శితమై స్టాండింగ్ ఓవేషన్ అందుకుంది. సుమారు 2గం.ల 49 నిమిషాలతో ఫ్రాంఛైజీలో సుదీర్ఘ నిడివి ఉన్న సినిమాగాను ఎంఐ 8 రికార్డులకెక్కుతోంది.