నేడు భారతదేశంలోని లెజెండరీ నటులలో కమల్ హాసన్ ఒకరు. కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో సినిమా హిస్టరీలో చెరగని ముద్ర వేసారు ఆయన. కమల్ ఒక ప్రయోగశాల. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒకవేళ ఇలాంటి ప్రతిభావంతుడు భారతీయ సినీపరిశ్రమకు పరిచయం కాకపోయి ఉంటే ఆ నష్టం అంతా ఇంతా కాదు.
కానీ కమల్ తాజా ఇంటర్వ్యూలో చెప్పిన ఒక మాట అందరినీ షాక్ కి గురి చేస్తోంది. తాను ఒకవేళ నటుడు అవ్వకపోతే కచ్ఛితంగా ఏ ఆటోవాలా అయ్యేవాడినేమో అని అన్నాడు. ఆటో తోలుతూ తాను ఎవరో తెలియకుండా ఆటోలోనే చనిపోయేవాడిని అని అన్నారు. ఒకసారి ఆయన పాతరోజుల్లోకి వెళ్లి తన గురువు బాలచందర్ గురించి గుర్తు చేసుకున్నారు. తాను దర్శకుడు అవ్వాలని అనుకుంటున్నట్టు గురువు గారికి చెప్పాడట. కానీ కమల్ హాసన్ ని నటుడు అవ్వాలని బాలచందర్ సూచించారు. దర్శకుడు అయితే ఆటోల్లో తిరుగుతూ జీవితం అయిపోతుందని బాలచందర్ నిరాశపరిచారు. దాంతో కమల్ హాసన్ నటుడు అయ్యాడు. ఆ తర్వాత చరిత్ర అంతా తెలిసిందే.
ఆసక్తికరంగా తన తల్లితో వాగ్వాదం కారణంగా తాను మంగళి షాపులో పని చేయాల్సి వచ్చిందని కమల్ హాసన్ గుర్తు చేసుకున్నారు. బాలచందర్ కంటే ముందే ఒక గురువు ఉన్నారు. ఆయన మంగళి షాపు యజమాని. సినిమా వార్తలు చదువుతూ, సినిమాలు చూస్తూ సమయం అంతా వృధా చేస్తున్నావని నా తల్లి నన్ను నిందించేది. అందుకే నా తల్లిపై పంతంతో నేను కటింగు మాస్టార్ ని అయ్యాను అని కమల్ గుర్తు చేసుకున్నారు. కమల్ హాసన్ యవ్వనంలో చాలా దూకుడుగా దుందుడుకుగా ఉండేవాడు అని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇంటర్వ్యూలో తన స్నేహితులు తనలా నటులు కాలేదని, వారంతా రకరకాల దారుల్లో వెళ్లి రోడ్లపైనే మరణించారని గుర్తు చేసుకుని విచారం వ్యక్తం చేసారు.