సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింతా గురించి పరిచయం అవసరం లేదు. హిందీ, తెలుగు చిత్రాల్లో మరపురాని నటన, గ్లామర్ తో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఐపీఎల్ టీమ్ లపై పెట్టుబడులు పెట్టిన ఎంటర్ ప్రెన్యూర్ గాను ఈ భామ సుపరిచితురాలు. తెలుగులో మహేష్ రాజకుమారుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అటుపై విక్టరీ వెంకటేష్ సరసన ప్రేమతో రా చిత్రంలో నటించింది ప్రీతి.
అయితే ప్రీతి జింతాను ఇటీవల క్రికెట్ స్టేడియం- వీఐపీ గ్యాలరీల్లో చూడటానికి ప్రజలు అలవాటు పడ్డారు. ప్రీతి చాలా కాలంగా నటనకు దూరంగా ఉంది. ఈ భామ విదేశీ ప్రియుడు జీన్ గూడెనఫ్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. తన భర్త గురించి అప్పుడప్పుడు మీడియా ఇంటర్వ్యూల్లో వెల్లడిస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రీతి తన తొలి ప్రేమ సంగతులు చెప్పి షాకిచ్చింది. తాను ప్రేమించిన మొదటి ప్రేమికుడు ఒక కార్ యాక్సిడెంట్ లో మరణించాడని తెలిపి షాకిచ్చింది.
నిజానికి తాను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయాక సర్వం కోల్పోయినట్టు భావించిందట. షారూఖ్, సైఫ్, ప్రీతి జింతా ప్రధాన పాత్రల్లో నటించిన క్లాసిక్ హిట్ మూవీ `కల్ హో నహో` రీరిలీజ్ సందర్భంగా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో తన గతం గురించి తలుచుకున్న ప్రీతి కలతకు గురైంది. ప్రేమ అంటే కొన్నిసార్లు వదులుకోవాల్సి రావడం.. ప్రతి ఒక్కరి జీవితంలో ఊహించని ఘటనలు ఉంటాయనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.