ఎగ్జిబిషన్ రంగం చాలా క్రైసిస్ లో ఉందన్న కథనాలొస్తున్నాయి. ఇలాంటి సమయంలో థియేటర్లు మనుగడ సాగించాలంటే, ప్రజల్ని థియేటర్లకు రప్పించడానికి ఏదైనా చేయాలి. స్థబ్ధుగా ఉన్న పరిశ్రమలో పరిస్థితులు చేజారక ముందే ఏదైనా చేసి తీరాలి. ముఖ్యంగా ఓటీటీ, బుల్లితెర కంటెంట్ ప్రజల్ని థియేటర్లకు రానివ్వకుండా చేస్తోంది. ఇలాంటి ఎన్నో పరిస్థితులు సినీరంగానికి ప్రమాదకరంగా మారాయి.
ఇదిలా ఉంటే థియేటర్లకు జనం రాకపోవడానికి కారణాలేమిటో అధ్యయనం చేయాల్సిందిగా కీలక బాధ్యతను ఏపీ ప్రభుత్వం ఒక కమిటీకి అప్పగించింది. ఇందులో తెలుగు సినీనిర్మాత వివేక్ కూచిభొట్ల కీలక సభ్యులుగా చేరారు. టికెట్ రేట్లు సహా పలు అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ అందించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
ఈ అవకాశాన్ని కల్పించిన ఏపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా వివేక్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ లకు థాంక్స్ చెప్పారు. వివేక్ కూచిభొట్ల పీపుల్స్ మీడియాలో సహనిర్మాతగా కొనసాగిన విషయం తెలిసిందే. ఎగ్జిబిషన్ పంపిణీ రంగంలోను అనుభవం సంపాదించారు ఆయన.