మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన `తారే జమీన్ పర్` 17 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాల్సి ఉండగా, చివరికి అమీర్ ఒక కొత్త కథతో ఇప్పుడు `సితారే జమీన్ పర్`ని విడుదలకు సిద్ధం చేసాడు. జూన్ 20న ఈ చిత్రం విడుదల కానుంది.
తాజాగా అమీర్ ట్రైలర్ ని రిలీజ్ చేసాడు. ట్రైలర్ ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే ఫన్, ఎమోషన్ వర్కవుటయ్యాయి. లాల్ సింగ్ చడ్డా లాంటి ఫ్లాప్ తర్వాత అమీర్ ఖాన్ తిరిగి కోలుకునేందుకు ఉపకరించే కంటెంట్ తో వస్తున్నాడని అర్థమైంది. ట్రైలర్ ని బట్టి ఈ చిత్రంలో పది మంది మానసిక వికలాంగుల బాస్కెట్ బాల్ టీమ్ కి అమీర్ ఖాన్ కోచ్ గా నటించాడు. అయితే వికలాంగులకు తర్ఫీదునిచ్చేందుకు అతడు ఎలాంటి పాట్లు పడ్డాడు? అన్నది తెరపైనే చూడాల్సి ఉంటుంది.
ట్రైలర్ లో గ్లింప్స్ ఆకట్టుకుంది. క్రీడా నేపథ్యంలో కామెడీ, ఎమోషన్ అద్భుతంగా పండించబోతున్నాడని అర్థమవుతోంది. ట్రైలర్ వేగంగా అభిమానుల్లోకి దూసుకెళుతోంది. పది మంది కొత్త కుర్రాళ్లను పరిచయం చేస్తూ అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. జెనీలియా కీలక పాత్రను పోషించారు. శంకర్-ఎహ్సాన్-లాయ్ అందించగా, అమితాబ్ భట్టాచార్య పాటలు రాశారు. రామ్ సంపత్ సంగీం అందించారు.