రీసెంట్ గా ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు కాల్పుల్లో వీరమరణం పొందిన మురళి నాయక్ ది ఏపీ కావడంతో ఇక్కడి ప్రభుత్వం, మరియు ప్రతిపక్ష నాయకులూ మురళి నాయక్ ను పరామర్శించేందుకు, సహాయం చెసేందుకు పోటీపడ్డారు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం మురళి కుటుంబానికి సంతాపం ప్రకటించగా, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తండాలోని అమర జవాన్ మురళి నాయక్ ఇంటికి వెళ్లడమే కాదు అందరూ మెచ్చుకునేలా మురళి నాయక్ పార్దీవ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు.
నారా లోకేష్ ప్రత్యేకంగా మురళి నాయక్ పార్దీవ దేహాన్ని మోసి అందరి మన్ననలు పొందారు. రాష్ట్రం ప్రభుత్వం వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి అండగా ఉండడమే కాదు 50 లక్షల పరిహారం ప్రకటించారు. బాదిత కుటుంబానికి 5 ఎకాల పొలం, నాయక్ తండ్రికి సర్కారీ కొలువు కూడా ప్రకటించారు.
మరి ఇంత చేసిన కూటమి ప్రభుత్వాన్ని ఎవ్వరైనా విమర్శిస్తారా, విమర్శిస్తే ఊరుకుంటారా, పొగడడం తప్ప చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా కూటమి ప్రభుత్వాన్ని మురళి నాయక్ విషయంలో చేసిన మంచినీ పొగడకుండా ఉండలేకపోయారు. మంగళవారం జగన్ శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తండాలోని అమర జవాన్ మురళి నాయక్ ఇంటికి వచ్చి మురళి కుటుంబాన్ని ఓదార్చారు.
మురళి నాయక్ కుటుంబానికి వైసీపీ అండగా నిలుస్తుందని ప్రకటించారు. అంతేకాకుండా నాయక్ కుటుంబానికి వైసీపీ తరఫున 25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని తాము అదికారంలో ఉండగా నిర్ణయం తీసుకున్నామని, ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఇప్పుడు కూటమి సర్కారు నాయక్ కుటుంబానికి 50 లక్షలు ఇచ్చిందన్న జగన్.. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం గమనార్హం.