తన తండ్రి ఏ హోటల్లో ప్లేట్లు క్లీన్ చేసాడో ఆ హోటల్ నే కొనేసాడు ఈ హీరో. అతడు చిన్నప్పుడు తన తండ్రికి హోటల్ పనిలో సాయం చేసాడు. వెయిటర్ గా , రిసెప్షనిస్టుగా పని చేసాడు. ఇంకా తన తండ్రి హోటల్ లో ఏ అవసరం ఉంటే ఆ పని చేసాడు. కానీ చివరికి విధి హీరో అయ్యేందుకు సహకరించింది. ఆ తర్వాత మాత్రం అతడు చాలా సాధించాడు. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి. యాక్షన్ హీరోగా బాలీవుడ్ ని కొన్నేళ్ల పాటు ఏలిన సునీల్ శెట్టి, ఇటీవల సౌత్ లోను నటుడిగా తనదైన ముద్ర వేస్తున్నాడు.
రజనీకాంత్ `దర్బార్`లో క్రూరుడైన విలన్ గా నటించిన సునీల్ శెట్టి ఇటీవల పలు సౌత్ సినిమాలలో నటించాడు. ఇదిలా ఉంటే, సునీల్ శెట్టి తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభ రోజుల గురించి గుర్తు చేసుకున్నాడు. అతడు దాదాపు 90శాతం(65రోజులు) షూటింగ్ పూర్తి చేసాక మొదటి సినిమా ఆగిపోయింది. దర్శకనిర్మాతల మధ్య వివాదం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఆ తరవాత మరో సినిమాలో నటించాలని భావిస్తే దర్శకుడు డేవిడ్ ధావన్ ఇది సునీల్ కెరీర్ కి సహకరించదని భావించారట. దాంతో అది ఆగిపోయింది. ఆ తరవాత బల్వాన్ అనే చిత్రంలో నటించాడు. ఇందులో దివ్యభారతి కథానాయికగా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించినా కానీ, తన నటనకు పేరు రాలేదు. తనకు నటన రాదని అన్నారు. లుక్ సరిగా లేదని విమర్శించారు. ఇడ్లీ వడ అమ్ముకోమని ఎగతాళి చేసారని సునీల్ శెట్టి తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.
అయితే తనకు అలా చెప్పినవారి వల్ల తాను ఏమీ మారలేదని అన్నాడు. తాను హోటల్ లో పని చేసానని గుర్తు చేసుకున్నాడు. ఆ రంగంలో చాలా నేర్చుకోవడం వల్లనే ఈరోజు సునీల్ శెట్టి ఇలా ఉన్నాడు! అని తెలిపాడు. అప్పుడు సునీల్ శెట్టినే.. ఇప్పుడు సునీల్ శెట్టినే .. ఎలాంటి మార్పు లేదు! అని అన్నాడు. నిజానికి సునీల్ శెట్టి తండ్రి హోటల్ రంగంలో రాణించారు. ఆయనకు వ్యాపారాలు కలిసి రాని రోజుల్లో హోటల్ లో పని చేసాడని గుర్తు చేసుకున్నాడు సునీల్ శెట్టి. కానీ అదే హోటల్‌ని కొనేసి తన తండ్రికి కానుకిచ్చానని తర్వాత చెప్పాడు. సునీల్ శెట్టి బాలీవుడ్ లో సుదీర్ఘ కాలం హీరోగా కొనసాగారు. పలు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నారు. యాక్షన్ హీరోగా అతడు చాలా పాపులారిటీ సంపాదించారు.