హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ తాజా చిత్రం `మిషన్: ఇంపాజిబుల్-ది ఫైనల్ రికనింగ్` ఈనెల 17న భారతదేశంలో పలు భాషల్లో అనువాదమై విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ది ఫైనల్ రికనింగ్ తెలుగు వెర్షన్ ని వీక్షించేందుకు తెలుగు ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అమెరికాలో ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషనల్ ఈవెంట్ లో టామ్ క్రూజ్ కి ఊహించని ప్రశ్న ఎదురైంది. సందర్భంగా అమెరికా వెలుపల చిత్రీకరించిన సినిమాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన సుంకాలపై అడిగిన ప్రశ్నకు స్పందించకుండా టామ్ తప్పించుకున్నాడు.
మేం సినిమా గురించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతాము.. ధన్యవాదాలు! అని టామ్ క్రూజ్ ఈవెంట్ లో వ్యాఖ్యానించాడు. దీనిని ప్రఖ్యాత `ది హాలీవుడ్ రిపోర్టర్` ఉటంకిస్తూ తన కథనంలో పేర్కొంది. ఫ్రాంచైజీలోని ఇతర చిత్రాల మాదిరిగానే, పారామౌంట్ పిక్చర్స్ ది ఫైనల్ రికనింగ్ ని ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ క్రూజ్ గూఢచారి ఈథన్ హంట్ పాత్రను తిరిగి పోషించారు. ఈ పాత్ర 1996 `మిషన్: ఇంపాజిబుల్`లో మొదటిసారి పోషించాడు. ఆ తర్వాత ఏడే సినిమాల్లో రిపీటైంది. ఇప్పుడు `మిషన్: ఇంపాజిబుల్ - ది ఫైనల్ రికనింగ్` చిట్టచివరిది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం అమెరికా వెలుపల చిత్రీకరించిన చిత్రాలపై 100 శాతం సుంకాలు విధిస్తున్నామని ప్రకటించారు. ఆ మరుసటి రోజు ఉదయం వైట్ హౌస్ లో ఇంకా ఏదీ ఖరారు కాలేదని తెలిపింది. వంద శాతం సుంకంపై వైట్ హౌస నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
భారతదేశంలో ఎంఐ8 దూకుడు:
ది ఫైనల్ రికనింగ్ (ఎం.ఐ 8) చిత్రం భారతదేశంలో ఈనెల 17న విడుదల కానుండగా ఇప్పటికే 1.25 లక్షల టికెట్లు అన్ని ప్లాట్ ఫామ్ లలో అమ్ముడయ్యాయని కథనాలొస్తున్నాయి. పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ సహా మరో మూడు చైన్ లలో 10,000 టికెట్లు డేవన్ లో అమ్ముడయ్యాయని, డే 2లో 15000 టికెట్లు అమ్ముడవుతాయని కూడా కథనాలొస్తున్నాయి. ఈ సిరీస్ లో ఏడో చిత్రం మొదటి రోజు 15 కోట్లు వసూలు చేయగా, ఎనిమిదో చిత్రం ది ఫైనల్ రికనింగ్ సుమారు 15-20 కోట్ల మధ్య వసూలు చేస్తుందని అంచనా. రెండు వారాల్లో ఈ చిత్రం 100కోట్లు వసూలు చేస్తుందా లేదా చూడాలి.