బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ `ఆపరేషన్ సిందూర్` పై తన బ్లాగులో సుదీర్ఘ లేఖ రాసారు. ఈ లేఖలో అమితాబ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. రచయిత హరివంశరాయ్ బచ్చన్ కుమారుడు గనుక స్వతహాగానే అమితాబ్ గొప్ప కవి. అతడు రాసిన సుదీర్ఘ లేఖలో కవితాత్మక వర్ణణ శైలి ప్రత్యేకంగా ఆకర్షించాయి.
ముఖ్యంగా తమ సిందూరాన్ని కాపాడాలనుకున్న భారతీయ వనితల కళ్ల ముందే భర్తలను చంపిన పాకిస్తానీ ఉగ్రమూకలపై రాక్షసులు అని అభివర్ణిస్తూ అమితాబ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కళ్ల ముందే భర్తల ఫ్యాంట్లు విప్పించారు. వారి మతాచారం ప్రకారం సున్తీ చేయించుకోని వారిని హిందువులుగా గుర్తించి హత్య చేసారు. కళ్ల ముందే మహిళలు తమ సిందూరాన్ని కోల్పోయారు. భర్తను చంపిన తర్వాత తనను కూడా చంపాలని ఒక భార్య కోరుకుంది. కానీ వారు అలా చేయకుండా వెళ్లు మీ మోదీకి చెప్పుకో! అని హుంకరించారని కూడా అమితాబ్ గుర్తు చేసారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఈ సైనిక చర్యకు ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టినట్టు అమితాబ్ వర్ణించారు.
ఉగ్ర ఘాతుకానికి ప్రతీకార చర్యగా ప్రధాని మోదీ స్పందించిన తీరును అమితాబ్ తన బ్లాగులో ప్రశంసించారు. భారతీయ సైన్యం సాహసాలను, విజయాలను కీర్తించారు. పీవోకేలో 9 చోట్ల ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడంలో మన సైనికులు విజయం సాధించారని అమితాబ్ అన్నారు. బార్డర్ లో సైనికులు ఎప్పటికీ తలొంచకూడదని, దేశాన్ని, ప్రజలను ఇలానే కాపాడాలని అమితాబ్ ఆకాంక్షించారు. అన్యాయానికి వ్యతిరేకంగా .. మీరు ఎప్పటికీ ఆగకూడదు .. మీరు ఎప్పటికీ వెనక్కి తిరగకూడదు .. మీరు ఎప్పటికీ లొంగకూడదు .. అగ్ని మార్గం! అగ్ని మార్గం! అగ్ని మార్గం!! అంటూ అమితాబ్ సుదీర్ఘ లేఖలో ఉద్విగ్నంగా రాసారు.