కరణ్ జోహార్ తో తన తదుపరి చిత్రం `నాగ్‌జిల్లా`ని ప్రకటించి సంచలనం సృష్టించాడు కార్తీక్ ఆర్యన్. నాగు పాముల ప్రపంచంలో నాగరాజుగా అతడు కనిపిస్తాడు. ఇచ్ఛాదారి నాగ్ అనే ప్రేయంవదేశ్వర్ ప్యారే చంద్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం 14 ఆగస్టు 2026న థియేటర్లలో విడుదల కానుంది. గత కొంతకాలంగా కరణ్ బృందం కాస్టింగ్ ఎంపికల్లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో యానిమల్ విలన్ బాబి డియోల్ లేదా యానిమల్ రణ్ విజయ్ తండ్రి అనిల్ కపూర్ విలన్‌గా నటించే అవకాశం ఉందని ఇటీవల గుసగుసలు వినిపిస్తున్నాయి.
నాగ్‌జిల్లా స్క్రిప్ట్ ప్రకారం.. ఇందులో నెగటివ్ పాత్రలో సీనియర్ నటుడు అవసరం. కరణ్ జోహార్ ఆ పాత్ర కోసం అనిల్ కపూర్ , బాబీ డియోల్ పేర్లను షార్ట్‌లిస్ట్ చేశాడు. ఆ ఇద్దరిలో ఎవరు? అన్నది ఇంకా నిర్ణయం కావాల్సి ఉంది. కార్తీక్ , మహావీర్ జైన్ లతో ఇప్పటికే మంతనాలు పూర్తయ్యాయి. ఇప్పుడు విలన్ గా నటించే సీనియర్ నటుడు ఎవరు? అన్నది తేలాల్సి ఉందని బాలీవుడ్ హంగామా పేర్కొంది.
ఇది ఇచ్ఛాధారి నాగిన్ కథ.. విలన్ల పాత్ర హీరో పాత్ర అంతటి కీలకమైనది. అందువల్ల. ఈ చిత్రం కోసం ఎవరిని లాక్ చేస్తారనే దానిపై చిత్రబృందం జాగ్రత్తగా వ్యవహరిస్తోందని నిర్మాతలు తెలిపారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మృగ్‌దీప్ సింగ్ లాంబా దర్శకత్వం వహిస్తున్నారు. గౌతమ్ మెహ్రా రచయిత. ఇది ఫాంటసీ కామెడీ నేపథ్యంలో రక్తి కట్టించనుందని చెబుతున్నారు. కార్తీక్ ధర్మ ప్రొడక్షన్ లో తు మేరీ మై తేరా- మై తేరా తు మేరీ చిత్రంలోను నటించనున్నాడు.