గత కొన్నేళ్లుగా ఏప్రిల్, మే మొత్తం ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ తో ఊగిపోయే యూత్ కి బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇండియా-పాకిస్తాన్ మధ్యన యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, ఇండియా సరిహద్దులపై పాకిస్తాన్ క్షిపణులతో దాడి చెయ్యడం ఇండియా మొత్తం ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించడం అసాధ్యం కావడంతో కొద్దిరోజుల పాటు ఐపీఎల్ మ్యాచ్ లను వాయిదా వేయనున్నట్టుగా తెలుస్తుంది.
గత రాత్రి ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అర్ధంతరంగా ఫ్లడ్ లైట్స్ ఆగిపోయాయి, దానితో వెంటనే ఆడియన్స్ అందరిని గ్రౌండ్ వదిలి వెళ్లిపోవాలని ఐపీఎల్ ఛైర్మన్ వచ్చి కోరడం కలకలం సృష్టించింది. పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడుతుండటంతో సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్ అవుట్ విధించారు.
ఈ రోజు ఉదయాన్నే బీసీసీఐ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు, ఇండియా-పాక్ మధ్యన జరుగుతున్న యుద్ధం కారణముగా ఐపీఎల్ 2025 నిలిపివేత గురించి చర్చించారని, కొన్నాళ్లపాటు ఐపీఎల్ మ్యాచ్ లు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుత అ పరిస్థితులు చక్కదిద్దుకునే వరకూ ఐపీఎల్ మ్యాచ్ లను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.