ఏడాది క్రితం భారతదేశంలోని అతి పెద్ద సినీనిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సగం వాటాను ప్రముఖ వ్యాపారవేత్త, సీరం అధినేత అయిన ఆదార్ పూనవల్లాకు సేల్ చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూనవల్లా నిధుల్ని సమకూరుస్తుంటే, సృజనాత్మకంగా కరణ్ తన సహకారం అందిస్తున్నాడు. చాలా సింపుల్ గా చెప్పాలంటే వేరొకరు డబ్బు పెడుతుంటే, ఇతడు సోకులు ప్రదర్శిస్తున్నాడు. అయితే ధర్మ ప్రొడక్షన్స్ ఈ స్థాయిని అందుకోవడానికి చాలా ముప్పు తిప్పల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇది అంత సులువుగా సాగిన ప్రయాణం కాదని కూడా కరణ్ వెల్లడించాడు. తన తండ్రి యష్ జోహార్ నిర్మాణ సంస్థను ప్రారంభించిన తర్వాత ఐదు సినిమాలు వరసగా ఫ్లాపులయ్యాయి. ఆ తర్వాత కుచ్ కుచ్ హోతా హై కి దర్శకత్వం వహించాక మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత కూడా నిధులు సరిపోక ఇతర భాగస్వాములతో కలిసి సినిమాలు నిర్మించిన కరణ్ సడెన్ గా ఇతరులతో స్నేహాలను కూడా వదిలేసాడు. దీనికి రకరకాల కారణాలను అతడు తెలిపాడు.
ఇదిలా ఉంటే, కరణ్ నిర్మించిన ఇటీవలి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవ్వడంపై తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు. తాము నష్టపోవడం లేదని అతడు వివరణ ఇస్తున్నా కానీ ఎవరూ దీనిని నమ్మడం లేదు. ధర్మ ప్రొడక్షన్స్ కి యథావిధిగా 2024 కూడా కలిసి రాలేదని కరణ్ వద్ద ప్రస్థావిస్తే అతడు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. గత ఏడాది నిర్మించిన సినిమాల్లో `కిల్` విమర్శకుల ప్రశంసలు పొందింది. మిస్టర్ & మిసెస్ మహి డబ్బును ఆర్జించింది. బాడ్ న్యూజ్ లాభదాయకంగా ఉంది.. జిగ్రా లాభాలు సాధించకపోయినా ఓకే మూవీ అని చెప్పాడు. ఇప్పుడు మా మొదటి పంజాబీ చిత్రం అకాల్‌ను నిర్మిస్తున్నాము.. ధడక్ 2 త్వరలో వస్తోంది. మేము వరుస చిత్రాలు చేస్తున్నామని కరణ్ చెప్పాడు. అంతేకాదు జయాపజయాలను తాను పట్టించుకోనని కరణ్ చెప్పాడు.
``నాకు అపజయం పట్టదు. నాకు సగటు సినిమాలు నచ్చవు. నేను తప్పు చేస్తే చెప్పు..నేర్చుకుంటాను .. ముందుకు వెళ్తాను!`` అని అగ్రనిర్మాత కరణ్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు సీరం ఇనిస్టిట్యూట్ ఆదార్ పూనవల్ల డైనమిక్ గా ఉన్నాడని ఆయన పెట్టుబడుల్ని సమకూరుస్తుంటే, తాను క్రియేటివ్ పార్ట్ ని నిర్వహిస్తున్నానని కరణ్ వెల్లడించాడు. వేరొకరి డబ్బు కాబట్టి మరింత బాధ్యతగా ఉన్నానని కూడా కరణ్ చెప్పాడు. అతడి వాలకాన్ని బట్టి వాటా దారు కారణంగా ఇప్పుడు కరణ్ బాధ్యతగా వ్యవహరిస్తున్నాడా? అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. మునుపటి పరాజయాలకు కారణం అలక్ష్యంగా ఉండటమేనా? అని కూడా కొందరు నిలదీస్తున్నారు. వీటన్నిటికి అతడు ఏం సమాధానం చెబుతాడో చూడాలి.