మెట్ గాలా ఈవెంట్లో ఒకరితో ఒకరు పోటీపడుతూ భారతీయ నటీమణులు అదరగొడుతున్న సంగతి తెలిసిందే. రెడ్ కార్పెట్ వేడుకలో ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ జంట ప్రధాన హైలైట్ గా కనిపించింది. తాజాగా ప్రియాంక చోప్రా ఈ వేడుక కోసం ధరించిన స్పెషల్ డైమండ్ పీస్ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
ఇది ప్రఖ్యాత బల్గరీ బ్రాండ్ నెక్లెస్. బల్గరీ పాలీక్రోమా హై జ్యువెలరీ కలెక్షన్ ని మెట్ గాలా2025 ఈవెంట్లో ప్రియాంక చోప్రా ప్రదర్శించింది. దీనిని మాగ్నస్ ఎమరాల్డ్ నెక్లెస్ అని పిలుస్తున్నారు. ఇది పచ్చ డైమండ్ తో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. 241.06 క్యారెట్ల ఎమరాల్డ్‌తో ఈ నెక్లెస్ ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల హారం.. అరుదైన రాళ్లతో రూపొందిందని బల్గరీ తన ఇన్ స్టాలో వెల్లడించింది.
గత ఏడాది జామ్ నగర్ లో అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో భాగంగా నీతా అంబానీ పచ్చ నెక్లెస్ తో కనిపించారు. ఆ నెక్లెస్ ఖరీదు కోట్లలో ఉంటుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రియాంక చోప్రా మెట్ గాలా 2025 ఈవెంట్లో అలాంటి పచ్చల హారం ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నెక్లెస్ ఖరీదు ఎంతో కానీ, బల్గరీ సంస్థ వివరాలు వెల్లడించలేదు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ సరసన రాజమౌళి తెరకెక్కిస్తున్న ఫారెస్ట్ అడ్వెంచర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈవెంట్ కోసం బ్రేక్ తీసుకున్న ఈ భామ తిరిగి సెట్స్ లో జాయిన్ కావాల్సి ఉంది.