కొంతకాలంగా బాలీవుడ్ లో ఒరిజినల్ స్క్రిప్టులు లేక, సరైన క్రియేటివిటీ లేక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. హిందీ సినిమాలతో ప్రజలు విసిగిపోతున్నారు. దీని ఫలితం సౌత్ నుంచి వచ్చే మసాలా సినిమాలను సైతం అక్కడ ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. హిందీ చిత్రసీమలో క్రియేటివిటీ స్థానంలో చచ్చు కథలతో రీమేకులు, ప్రీమేకులు, సీక్వెల్ సినిమాలు అంటూ ప్రజలను విసిగిస్తున్నారని విమర్శలు ఎదురవుతున్నాయి. అనువాదాలను యూట్యూబ్ లో చూసేసిన తర్వాత సౌత్ సినిమాల్ని రీమేక్ చేస్తూ బాలీవుడ్ అగ్ర హీరోలు ఫ్లాపుల్ని ఎదుర్కొంటున్నారు.
దేశంలోని అతి పెద్ద పరిశ్రమ అయిన బాలీవుడ్ లో ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడం తనను కలవరపాటుకు గురి చేసిందని, హిందీ చిత్రసీమలో విషపూరితమైన కల్చర్ పాతుకుపోయిందని, సృజనాత్మకత స్థానంలో చెత్త కంటెంట్ ని నెత్తికెత్తుకుంటున్నారని ఇంతకుముందు అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకుడు వాపోయాడు. తాను బాలీవుడ్ వదిలి వెళుతున్నానని అన్నారు. ప్రస్తుతం అతడు సౌత్ కి వచ్చి సినిమాల్లో నటిస్తున్నాడు.
తాజాగా అనురాగ్ కశ్యప్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని మద్ధతు పలికాడు వెటరన్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి. బాలీవుడ్ లో విషపూరిత వాతావరణం నచ్చక అతడు వెళ్లిపోయాడని, హిందీ చిత్రసీమ ఒరిజినల్ కథలతో సినిమాలు తీయడం లేదని, రీమేకులు సీక్వెల్ సినిమాలపై ఆధారపడుతోందని నవాజుద్దీన్ ఆందోళన వ్యక్తం చేసారు. సృజనాత్మకత కొంచెం కూడా కనిపించడం లేదని అతడు అన్నాడు. ఒరిజినల్ స్క్రిప్టులతో అనురాగ్ కశ్యప్ సినిమాలు తీసారని ప్రశంసించారు. అతడు పరిశ్రమను వదిలేయడం సరైన నిర్ణయమేనని అన్నారు. నిర్మాతలు మారడం లేదని, కళాకారుల్ని కిందికి అణగదొక్కుతున్నారని విమర్శించారు. నవాజుద్దీన్ ప్రఖ్యాత నటుడు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. అతడి వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ గా మారాయి.