నటసింహా నందమూరి బాలకృష్ణ పంచ్ డైలాగులకు పడిపోని తెలుగువాడు లేడు! వెండితెర సమరసింహం ఆయన. ఐదు దశాబ్ధాల పాటు తెరను ఏలిన నటసింహం. అందుకేనేమో.. ఆయన తనను తాను పొగిడేసుకున్నా ఎదుటివాడికి అది ఎబ్బెట్టుగా అనిపించదు. భోళా మనస్తత్వం ఉన్న ఆయన వేదికపైకి ఎక్కితే ఊగిపోతారు. ఉద్వేగాన్ని ఆపుకోలేరు. మనసులో ఉన్నదంతా సూటిగా కక్కాల్సిందే. డేరింగ్ గా గట్సీగా తన స్పీచ్ లో తాను అనుకున్నది మాట్లాడేస్తారు. అయితే దీనిని కొందరు ఎగతాళిగా చూసినా కానీ, ఆయన బాణీ ఎప్పటికీ మారదు.
ఇటీవల ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న ఆయనను సన్మానించిన హిందూపురం ప్రజల్ని ఉద్ధేశించి ఆయన ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు చర్చగా మారింది. ఈ వేదికపై తనను తాను పొగుడుకునేందుకు ఆయన ఏమాత్రం జంకలేదు. సుమారు గంట పైగానే ఆయన స్పీచ్ లో స్వీయమర్ధనం కొనసాగింది. ఇక హిందూపురంలో తాను చేసిన అభివృద్ధి పనులే వరసగా మూడుసార్లు ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టాయని ఆయన అన్నారు. చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. మధ్యలోనే పోయారు! అంటూ పంచ్ లు విసిరారు. ఇక తన తండ్రి గారైన నందమూరి తారకరామారావు చేయలేకపోయిన కథల్లోను తాను చేసానని అన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం అలా చేసినదేనని వివరించారు.
ఈయనకు ఏం చూసుకుని ఆ పొగరు? అని అంటారు... నన్ను నేను చూసుకుని ఆ పొగరు అని నేను అంటాను అని నిర్మొహమాటంగా అన్నారు. వేదికపై తన భాషా పాండిత్యాన్ని ప్రదర్శించిన ఎన్బీకే స్టైల్ కి అభిమానులు ఉర్రూతలూగారు. ``నాలుగు వరుస హిట్లు కొట్టాను. నాలాగా 50 ఏళ్లు నటించిన హీరో ప్రపంచంలోనే ఎవరూ లేడు!`` అని కూడా బాలయ్య ఈ వేదికపై బోల్డ్ కామెంట్ చేయడానికి వెనకాడలేదు. ప్రస్తుతం ఎన్బీకే వ్యాఖ్యానంపై మీమ్స్ ఫెస్ట్ కొనసాగుతోంది. అయితే బోల్డ్ గా మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసే ఎన్బీకే మనస్తత్వం గురించి తెలిసి కూడా నెటిజనులు మరీ అంత సీరియస్ గా తీసుకోవడం తగునా? సోషల్ మీడియాలలో హుందాగా స్పందించాల్సిన చోట ఎందుకీ దురుసైన కామెంట్లు?