NCERT పాఠశాల పాఠ్యాంశాల్లో చారిత్రక ప్రాతినిధ్యం గురించి జరుగుతున్న చర్చలో నటుడు ఆర్. మాధవన్ తన దృక్పథాన్ని షేర్ చేసారు. పాఠశాల చరిత్ర పాఠ్యపుస్తకాల్లో మొఘల్ సామ్రాజ్యానికి అనవసర ప్రాధాన్యతను కనబరిచారని విమర్శించారు. చరిత్ర పాఠ్యపుస్తకాల్లో ఎక్కువ భాగాన్ని మొఘల్ రాజవంశం ఆక్రమించిందని, ఇది భారత చరిత్ర వాస్తవాల్ని, సత్యాన్ని ప్రతిబింబించదని మాధవన్ వాదించారు.
`కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్` చిత్రంలో చారిత్రక వాస్తవాలను చూపించినా, సృజనాత్మక స్వేచ్ఛను తీసుకోవడంపై పలువురు ఆరోపించారు. ఈ ఆరోపణలకు మాధవన్ ప్రతిస్పందించారు. చరిత్ర అంశాలపై మ్యాడీ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. తాను దీనిపై స్పందిస్తే వివాదాస్పదం అవ్వొచ్చని, కానీ తన మాటలకు కట్టుబడి ఉంటానని మాధవన్ చెప్పారు. తన పాఠశాల రోజులను గుర్తుచేసుకున్న మ్యాడీ చరిత్ర పాఠ్యాంశాలలో లోటు పాట్లను వెలికి తీసారు. మొఘలుల గురించి ఎనిమిది అధ్యాయాలు, హరప్పా , మొహెంజో-దారో నాగరికతలపై రెండు, బ్రిటిష్ పాలన, స్వాతంత్య్ర పోరాటంపై నాలుగు, చోళులు, పాండ్యులు, పల్లవులు, చేరాలు వంటి పురాతన దక్షిణ భారత రాజ్యాల గురించి కేవలం ఒక అధ్యాయంపై మాత్రమే దృష్టి సారించాయని మాధవన్ పేర్కొన్నాడు. బ్రిటిష్ వారు , మొఘలులు మనల్ని దాదాపు 800 సంవత్సరాలు పరిపాలించగా, చోళ సామ్రాజ్యానికి 2,400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. వారు సముద్ర అన్వేషణ , నావికా శక్తిలో మార్గదర్శకులు, వాణిజ్య మార్గాలు రోమ్ వరకు విస్తరించి ఉన్నాయి. మన చరిత్ర పాఠాల్లో ఆ భాగం ఎందుకు లేదు? అంగ్కోర్ వాట్ వద్ద ఉన్నటువంటి మన బలమైన నావికా శక్తితో నిర్మించిన దేవాలయాల ప్రస్తావన ఎక్కడ ఉంది? జైన మతం, బౌద్ధమతం , హిందూ మతం చైనాకు వ్యాపించాయి. కొరియాలోని ప్రజలు తమిళం మాట్లాడతారు. ఎందుకంటే మన భాష ఇప్పటివరకు వ్యాపించింది. కానీ ఇవన్నీ కేవలం ఒక అధ్యాయంలో కుదించేసారు! అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏడో తరగతి చరిత్ర పాఠ్యపుస్తకాల నుండి మొఘల్ సామ్రాజ్యం, ఢిల్లీ సుల్తానేట్ గురించిన అన్ని ప్రస్తావనలను తొలగించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) తీసుకున్న నిర్ణయం గురించి జరుగుతున్న చర్చను మాధవన్ తనదైన శైలిలో విశ్లేషించారు. ఈ విభాగాల స్థానంలో పుణ్య భూమి శాస్త్రం, మహాకుంభమేళా, మేక్ ఇన్ ఇండియా, బేటీ బచావో బేటీ పఢావో వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన కంటెంట్ చేర్చారు.