ఆడియో, విజువల్ రంగంలో పెనుమార్పులు, మారుతున్న సాంకేతికత సహా సినీరంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు `వేవ్స్ 2025 సమ్మిట్`లో ప్రయత్నాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేదిక కోసం అంతర్జాతీయ సినీప్రముఖులు సహా దేశవ్యాప్తంగా ఉన్న సినీదిగ్గజాలు ఎటెండయ్యారు. ఇలాంటి వేదికపై భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ RRRపైనా, ఆ సినిమాని తెరకెక్కించిన రాజమౌళిపైనా ప్రశంసలు కురిపించారు.
మన సినిమా భారతీయ సంస్కృతిని ప్రపంచ వేదికకు పరిచయం చేసిందని, భారతీయ సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగే సమయం ఇదేనని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ వేదికపై లెజెండరీ నటుడు రాజ్ కపూర్, దాదా సాహెబ్ ఫాల్కే వంటి ప్రముఖుల పేర్లను ప్రధాని ప్రస్థావించారు. దశాబ్ధాల క్రితం రాజా హరిశ్చంద్ర విడుదలైన సమయాన్ని కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు.
రాజమౌళి, ఏ.ఆర్.రెహమాన్ వంటి ప్రముఖులు మన సినిమా ఖ్యాతిని పెంచారని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, దేవరకొండ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈనెల 4 వరకూ సమ్మిట్ జరగనుంది.