ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి గత ఐదేళ్ళలో అమరావతిని రాజధాని కాదు ఏపీకి మూడు రాజధానులు ఉండాలి అంటూ మూడు రాజధానుల నినాదానికి తెరలేపి అమరావతిని సర్వనాశనం చేసిన జగన్ ను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడేసింది. జగన్ మూడు రాజధానుల నినాదమే ఆయనని దెబ్బతీసింది.
2024 ఎన్నికల్లో జగన్ ఓటమికి అదీ ఓ కారణమైంది. ఇప్పుడు మే 2 న పీఎం నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. దానికోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అమరావతిలో రేపు అంటే మే 2న జరగబోయే పునర్నిర్మాణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను ఆహ్వానించింది అధికార ఎన్డీయే కూటమి ప్రభుత్వం.
మరి అధికారం చేపట్టాక మూడు రాజధానులు అంటూ వైజాగ్ కి ఎక్కువ సమయం కేటాయించిన జగన్ ఇప్పుడు పునర్నిర్మాణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరవుతారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. హాజరు కాకపోతే జగన్ ఇంకా మూడు రాజధానుల మాట మీదే నిలబడినట్లు సంకేతాలు వెళతాయి. ఒకవేళ హాజరైతే అమరావతికి జగన్ జై కొట్టినట్లే అవుతుంది.
చంద్రబాబు మొదటినుంచి అమరావతి రాజధాని అనే మాట మీదున్నారు. కానీ జగన్ అమరావతిని ముందు ఒప్పుకుని అధికారంలోకి రాగానే మూడు రాజధానుల ముచ్చట లేపారు. ఇప్పుడు అదే ఆయన్ను ఇరాటంలో పడేసింది. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి వెళ్లినా ఒక దొబ్బు వెళ్లకపోయినా ఒక దొబ్బు అన్నట్టుగా తయారైంది జగన్ పరిస్థితి.