బాలీవుడ్ బాద్షా షారూఖ్ వెండితెరపైకి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నాడు. డంకీ తర్వాత అతడు భారీ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ `కింగ్` కోసం ప్రిపరేషన్ మొదలైంది. నటవారసురాలు సుహానా ఖాన్ ఈ చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేయనుంది. ది ఆర్చీస్ సిరీస్ తర్వాత సుహానాకు ఇది పెద్ద అవకాశం. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కింగ్ ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరందుకున్నాయి.
తాజా సమాచారం మేరకు.. లక్కీ ఛామ్ దీపిక పదుకొనే కింగ్ ఖాన్ సరసన నటించనుంది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, సుహానా ఖాన్, అభయ్ వర్మ, అర్షద్ వార్సీ, జైదీప్ అహ్లవత్ వంటి భారీతారాగణం నటించనున్నారు. ఇప్పుడు దీపిక చేరికతో టీమ్ లో మరింత ఉత్సాహం పెరిగింది. నిజానికి దీపిక ఇటీవల తన బిడ్డతోనే ఎక్కువ సమయం గడుపుతోంది. మామ్ అయింది కాబట్టి ఇకపై జిమ్ కి వెళ్లి తన రూపాన్ని ట్రిమ్ చేయడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. కింగ్ షెడ్యూల్ రకరకాల కారణాలతో అంతకంతకు ఆలస్యమైంది.
ఇప్పటికే షారూఖ్ ఈ సినిమా కోసం కరీనా, కత్రిన లాంటి స్టార్లతోను మంతనాలు సాగించారు. కానీ ఆ ఇద్దరి ఎంపిక గురించి ఇంకా పూర్తి సమాచారం లేదు. దీపిక ఈ చిత్రంలో పూర్తి నిడివి పాత్రలో కాకుండా అతిథిగా కనిపించనుందని కూడా గుసగుస వినిపిస్తోంది. దీపికపై షూటింగ్ దాదాపు 10 నుండి 12 రోజులు ఉంటుంది. అక్టోబర్ నుంచి తనపై షూటింగ్ జరగనుంది. ఓం శాంతి ఓం నుంచి పఠాన్, జవాన్ వరకూ దీపిక ఐదుసార్లు షారూఖ్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఆరోసారి అవకాశం అందుకుంటోంది. ఆసక్తికరంగా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా నటించేందుకు అవకాశం ఉందని తెలిసింది. కింగ్ 2026 చివరిలో విడుదలయ్యేందుకు ఆస్కారం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. సచిన్ -జిగర్ ద్వయం సంగీతం అందించనున్నారు.