రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కించిన `రంగస్థలం` గోదారి సంస్కృతి, పల్లె పట్టు సొగసును ఆవిష్కరిస్తూ మాస్ పాత్రలతో రూపొందిన క్లాసిక్ గా అందరి మనసుల్ని గెలుచుకుంది. అందుకే ఇప్పుడు మరోసారి ఇదే జోడీ రిపీటవుతోంది అనగానే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుక్కూ ఈసారి ఎలాంటి స్క్రిప్టును ఎంపిక చేస్తాడు? అన్నది ఉత్కంఠగా మారింది.
చరణ్ తన తాజా చిత్రం `పెద్ది`ని పూర్తి చేసుకుని సుకుమార్ కోసం రెడీ కావాల్సి ఉంది. ఈలోగానే సుకుమార్ తన విరామాన్ని ముగించి చరణ్ కోసం ఒక మంచి బౌండ్ స్క్రిప్ట్ ని రెడీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. `పుష్ప 2` రిలీజ్ తర్వాత సుకుమార్ పూర్తిగా విశ్రాంతిలో ఉన్నాడు. మే నెల అంతా రెస్ట్ లో ఉంటాడు. అటుపై జూన్ లో తన రచనా బృందంతో కలిసి చరణ్ కోసం స్క్రిప్ట్ వర్క్ లోకి దిగుతాడని సమాచారం.
అయితే చరణ్ కోసం ఈసారి సుకుమార్ ఎలాంటి కాన్సెప్ట్ ని ఎంపిక చేసుకునేందుకు ఆస్కారం ఉంది? అంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత సన్నివేశంలో లోకల్ కాన్సెప్టులు పాన్ ఇండియాలో రీచ్ కావడం సాధ్యపడదు. ఇకపై దర్శకరచయితలు ఎంచుకునేవి యూనివర్శల్ అప్పీల్ తో ఉండాలి. చారిత్రక కథలు, భారీ స్పై యాక్షన్ కథలు, సోషియో ఫాంటసీలు, సూపర్ మేన్ కాన్సెప్టులతో సినిమాని మరో లెవల్ కి చేర్చారు మన దర్శకరచయితలు. అందుకే ఇకపై పాన్ ఇండియా స్టార్లు అంతకుమించి యూనివర్శల్ అప్పీల్ ఉండే స్క్రిప్టుల్ని ఎంచుకోవాల్సిన సన్నివేశం ఉంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో బన్ని పాత్రను లార్జర్ దేన్ లైఫ్ తరహాలో సూపర్ హీరోగా మలచడంలో సక్సెసైన సుకుమార్ తదుపరి రామ్ చరణ్ ని కూడా ఆ రేంజులో ఆవిష్కరిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. పెరుగుతున్న అంచనాల నడుమ సుకుమార్ రైటింగ్ టీమ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సుక్కూ ఎంపిక చేసుకునే కాన్సెప్ట్ ఏమిటన్నదే అందరిలో ఉత్కంఠను కలిగిస్తోంది.