బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ `మహాభారతం`ను ఈ ఏడాదిలో ప్రారంభిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ భారీ ఎపిక్‌ని `లార్డ్ ఆఫ్ ది రింగ్స్` ట్రయాలజీ తరహాలో ఒకేసారి పలువురు దర్శకులతో తెరకెక్కించాల్సి ఉంటుందని, నిర్మాత అమీర్ ఖాన్ తెలిపారు. ఒకే సమయంలో అన్ని భాగాలను ప్రారంభిస్తాం. ఒక్కో భాగానికి ఒక్కో దర్శకుడు పని చేస్తారు. ఇది లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్ మేకింగ్ విధానాన్ని పోలి ఉంటుందని అమీర్ వెల్లడించారు. అయితే రచనా ప్రక్రియకు ఇంకా సమయం పడుతుందని అన్నారు. ఇందులో అమీర్ ఖాన్ నటిస్తారా? లేదా? అన్నదానిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
అయితే మహాభారతంలో `కురుక్షేత్ర యుద్ధ ఘట్టం` ఎంతటి కీలకమైనదో తెలిసిందే. పాండవులు, కౌరవుల మధ్య భీకర పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించేందుకు చరిత్రలో దిగ్గజ దర్శకులు ఎందరో ప్రయత్నించారు. కురుక్షేత్రం టైటిల్ తో టాలీవుడ్ లో క్లాసిక్ డే సినిమాలు, టీవీ సిరీస్ లు వచ్చాయి. అవన్నీ గొప్పగా ప్రజాదరణ పొందాయి. అయితే కురుక్షేత్రంలో అత్యంత కీలకమైన వార్ పార్ట్ ని తెరకెక్కించేందుకు ఎస్.ఎస్.రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు అయితేనే కరెక్ట్ అని అభిమానులు భావిస్తున్నారు. అమీర్ ఖాన్ కొందరు దర్శకులను ఎంపిక చేయాల్సి ఉండగా, ఇందులో కీలకమైన వార్ ఎపిసోడ్స్ తో నిండిన భాగానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తే, ఈ ట్రయాలజీ ఫ్రాంఛైజీకి గౌరవం పెరుగుతుందని, హాలీవుడ్ రేంజులో మార్కెట్ చేసుకునేందుకు అమీర్ ఖాన్ కి వెసులుబాటు లభిస్తుందని విశ్లేషిస్తున్నారు.
బాహుబలి -1, బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్ లాంటి చిత్రాలతో జక్కన్న ఖ్యాతి విశ్వవిఖ్యాతం అయింది. భారతదేశానికి ఆస్కార్ ని అందించిన ఘనత రాజమౌళికి దక్కింది. ఈ సినిమాల్లో వార్ ఎపిసోడ్స్ ని ఫైట్స్ ని రాజమౌళి అసాధారణంగా తెరకెక్కించారు. అందువల్ల మహాభారతం లోని కీలకమైన కురుక్షేత్రం పార్ట్ కి రాజమౌళి దర్శకత్వం వహిస్తే అది సెన్సేషన్‌గా మారుతుందని విశ్లేషిస్తున్నారు. అయితే అమీర్ ఖాన్ అలాంటి ప్రతిపాదన తన ముందు ఉంచితే, రాజమౌళి అంగీకరిస్తారా? అన్నది సస్పెన్స్. ఛాయిస్ ఏమాత్రం ఉన్నా, తాను మహాభారతం సిరీస్ ని ప్రారంభిస్తానని రాజమౌళి కూడా ఇంతకుముందు ప్రకటించారు. అందువల్ల ఏం జరుగుతుందో వేచి చూడాలి.