98వ అకాడమీ అవార్డుల కోసం డేట్ లాక్ అయింది. 15 మార్చి 2026 ఆదివారం నాడు ఏబీసీలో ఆస్కార్ పురస్కారాలు ప్రసారం కానున్నాయి. ఆ మేరకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఓ ప్రకటన జారీ చేసింది. ఈసారి కొత్త ఓటింగ్ నియమాలు, అర్హత మార్గదర్శకాలను ప్రకటించింది. మారిన రూల్స్ ప్రకారం...
ఫైనల్ ఆస్కార్ రౌండ్‌లో ఓటు వేయడానికి అర్హత పొందడానికి అకాడమీ సభ్యులు ఇప్పుడు ప్రతి విభాగంలో నామినేట్ అయిన అన్ని చిత్రాలను చూడాలి. దీని కారణంగా ఓటింగ్ న్యాయబద్ధంగా ఉంటుందని జూరీ భావించింది.
ఉత్తమ చిత్రం పరిశీలన కోసం పీజీఏ సర్టిఫికేషన్ గడువులను అకామెడీ నిర్ణయించింది. జనవరి 1 - జూన్ 30 మధ్య విడుదలైన చిత్రాలకు 10 సెప్టెంబర్ 2025 ఆఖరు తేదీ. సంవత్సరం చివరి భాగంలో విడుదలైన చిత్రాలకు 13 నవంబర్ 2025 ఆఖరు తేదీ. మ్యూజిక్ విభాగంలో పోటీకి గడువును ప్రకటించింది. ఒరిజినల్ సాంగ్ సమర్పణలకు 15 అక్టోబర్ 2025, ఒరిజినల్ స్కోర్ ఎంట్రీలకు 3 నవంబర్ 2025 ఆఖరి తేదీలుగా అకాడెమీ నిర్ణయించింది.
అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగానికి సంబంధించి కొన్ని పరిమితుల్ని అకాడెమీ విధించింది. ఇలాంటి సినిమాల్లో రచయిత, దర్శకుడి క్రియేటివిటీకి ప్రాధాన్యతనిస్తారు. ఈసారి పురస్కారాల్లో కాస్టింగ్ డైరెక్టర్స్ కూడా ఓటింగ్ లో పాల్గొంటుండడం మొదటిసారి. సినిమాటోగ్రఫీ వర్గం ప్రాధాన్యతను ఈసారి పెంచారు. తుది నామినేషన్లకు ముందు 10 నుండి 20 చిత్రాల ప్రాథమిక షార్ట్‌లిస్ట్ ఉంటుందని అకాడెమీ వెల్లడించింది.