సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండో వారం కూడా మంచి ఆక్యుపెన్సీ దక్కించుకోవడంతో చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా భీమవరంలో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ సంబరం పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమాలో నటీనటులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరై సందడి చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఇంత పెద్ద విజయంగా మార్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని తన భవిష్యత్ సినిమాలపై అభిమానుల అంచనాలు ఎక్కువయ్యాయని అన్నారు. గోదావరి జిల్లాల్లో తన సినిమాలు ఎల్లప్పుడూ మరింత మంచి ఆదరణ పొందుతాయన్నారు. గోదావరి జిల్లాల్లో ప్రజలంతా సంతోషంగా, సరదాగా ఉంటారు. గోదావరి వాసులు మర్యాదకు మారు పేరు అని అనిల్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఒక అభిమాని ప్రభాస్‌తో సినిమా ఎప్పుడు చేస్తారని అడగగా, అనిల్ స్పందిస్తూ.. నేనూ ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నాను. మీరు అందరూ గట్టిగా కోరుకుంటే అది త్వరగా జరుగుతుంది అని చెప్పారు.
ప్రభాస్ ప్రస్తుతం మారుతితో రాజా సాబ్, హను రాఘవపూడితో ఫౌజీ చిత్రాలపై పని చేస్తున్నారు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. అనంతరం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రానికి సిద్ధమవుతున్నారు. ప్రభాస్‌కు హాస్యభరిత కథలంటే ఇష్టమన్న విషయం దృష్టిలో ఉంచుకుని అనిల్ ఓ మంచి కథతో ముందుకు వెళ్తే.. ప్రభాస్ తో సినిమా జరగడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.