‘RRR’ మూవీ హైలైట్స్ ఇవే.. లీకులొచ్చాయ్!!


బాహుబలి సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న. బహుబలికి ఏ మాత్రం తగ్గకుండా అంతకుమించి బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ చిత్రంలో స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారు. ఇప్పటికే సుమారు 70% సినిమాకు పైగా షూటింగ్ అయిపోయిందని చిత్రబృందమే ప్రకటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు అయిపోవచ్చినప్పటికీ ఇప్పటికీ సింగిల్ లుక్ కూడా రిలీజ్ చేయకపోవడం గమనార్హం. ఈ క్రమంలో పలు వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో గాసిప్స్ పెద్ద ఎత్తున వస్తుండటంతో అసలు వేటిని నమ్మాలో..? వేటిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. దీంతో ‘RRR’ యూనిట్ నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని అటు ఎన్టీఆర్.. ఇటు చెర్రీ.. మరోవైపు జక్కన్న వీరాభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

హైలైట్స్ ఇవీ...!

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు పుకార్లు షికారు చేసినప్పటికీ ఒక్కదానిపై కూడా జక్కన్న స్పందించిన దాఖలాల్లేవ్. అయితే తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. మూవీలో చెర్రీ పాత్రే ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు.. హీరోయిన్‌కు సంబంధించిన సన్నివేశాలు కూడా కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటాయట. అందుకే ఇటీవలే అలియా భట్‌కు సంబంధించిన సీన్స్‌ అన్నీ ముగించేశారు. అలియాతో 15 నిమిషాలు మినహా సినిమా మొత్తమ్మీద చెర్రీ పాత్రే హైలైట్ అని తెలుస్తోంది. కాగా.. బాలీవుడ్ బ్యూటీ చేసింది 15 నిమిషాలే అయినా పారితోషికం మాత్రం గట్టిగానే పుచ్చుకుందట. చెర్రీ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం విదితమే.

అన్నీ రొమాన్సేనట..!

ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. ఈ చిత్రంలో ‘బుడ్డోడు’ కొమరం భీమ్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో జూనియర్ పాత్ర 30% మాత్రమే ఉంటుందట. అయితే ఆయన ఉన్నంత సేపు కాస్త సీరియస్‌గా.. మిగిలినదంతా రొమాన్సేనని తెలుస్తోంది. బ్రిటీష్ బ్యూటీ ఒలివీయాతో రొమాంటిక్ సీన్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయని సమాచారం. ఇప్పటికే ఆలియాను బాయ్ బాయ్ చెప్పేసిన సినిమా యూనిట్.. ఆ తెల్లపిల్లకు వెల్‌కమ్ చెప్పేశారట. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జూనియర్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతోందట. అయితే సినిమాలో కామెడీ మాత్రం పెద్దగా లేదని సమాచారం.

కాగా.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీతో పాటు 10 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఇందులో నిజానిజాలెంతో జక్కన్న అండ్ సినిమా యూనిట్‌కే ఎరుక. ప్రస్తుతం సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో మాత్రం ఇదిగో లీకులొచ్చాయ్.. అదుగో లీకులొచ్చాయని పెద్ద హడావుడే జరుగుతోంది. మరి అసలు సంగతేంటో..? ఎవరి పాత్ర ఎలా ఉంటుందో..? తెల్లపిల్ల అదుర్స్ అనిపించిందా..? లేకుంటే బాలీవుడ్ బ్యూటీ వావ్ అనిపిస్తుందా..? అనేది తెలియాలంటే వచ్చే ఎడాదిలో సినిమా రిలీజయ్యే వరకు వేచి చూడక తప్పదు.

RRR Movie : These are Highlights Leaked :

RRR Movie : These are Highlights Leaked 


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWSLATEST IN GALLERIES

POPULAR GALLERIES