Advertisement

ఇలానే అయితే..పవన్ పై విమర్శలు తప్పవు!


ఏ కులంకి చెందిన వారిని, ఏ హీరోకు, ఏ రాజకీయనాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వారి వీరాభిమానులు తీవ్రంగా విమర్శిస్తుంటారు. తమ విజ్ఞతను కోల్పోతుంటారు. ఆ వార్తల్లో ఉన్న తప్పులను నిజాయితీగా ఎత్తిచూపే విజ్ఞుల అవసరం ఎంతైనా ఉంది. అంతేగానీ, ఎవరికో కొమ్ముకాస్తున్నారంటూ అన్‌పార్లమెంటరి పదాలను వాడటం మానుకోవాలి. ఎవరైనా సర్వజ్ఞునులు కాదు. జర్నలిస్ట్‌లకు కూడా అన్ని విషయాలు తెలియకపోవచ్చు. తప్పులు దొర్లవచ్చు, వాటిని నిజాయితీగా ఎత్తిచూపి, ఆయా తప్పులను రాసిన వారికి సరైన మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంది. నేటి మీడియా కూడా కొన్ని కులాల, రాజకీయపార్టీల, నాయకుల, వ్యాపార పారిశ్రామికవేత్తల ధనబలంతో నడుస్తోంది. ఇది అక్షర సత్యం. జర్నలిస్ట్‌లలో కూడా అమ్ముడుపోతున్న వారెందరో ఉన్నారనేది కూడా నిజమే. ఇక మొదటి నుంచి మీడియాకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో మన పూర్వీకులు తమ నిజాయితీతో తెలిపారు. ప్రతిపక్షాలు కూడా చేయలేని పనిని మీడియా చేయాలని, అధికారంలో ఉన్న వారు చేసిన మంచిపనులను వారెలాగూ డప్పుకొట్టి చెప్పుకుంటారు.. కాబట్టి, ప్రభుత్వాలు చేసే తప్పులను ఎక్కువగా ఎత్తిచూపాలని, మీడియా అనేది ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభం వంటిదని తెలిపారు. దీనినే తారకమంత్రంగా జపించిన ఎన్‌కౌంటర్‌ దశరథరామ్‌ నుంచి తరుణ్‌తేజ్‌పాల్‌ వరకు, శ్రీశ్రీ నుంచి నేటితరంలో కూడా కొందరు నిజాయితీగా పనిచేస్తూనే ఉన్నారు. తప్పులను తప్పులని ఒప్పుకుందాం.. దీనికి పెద్దమనసు కావాలి. 

Advertisement

ఇక పవన్‌ని, చిరంజీవిని విమర్శిస్తే కాపులు, మెగాభిమానులు మండిపడటం మామూలే. దీనికి ఏ కులం, ఏ హీరో కూడా అతీతం కాదు. పవన్‌ విషయానికి వస్తే ఆయన ఈమద్య రాజకీయాలలోకి వచ్చిన తర్వాత తరుచుగా పలుసమస్యలను లేవనెత్తుతూనే ఉన్నాడు. తన నిరసన గళాన్ని గట్టిగా వినిపిస్తూ కొందరినైనా ఆలోచింపజేస్తున్నాడు. ఇది ప్రశంసనీయం. అదే సమయంలో ఆయన పలు సమస్యలను లేవనెత్తుతున్నప్పటికీ ఆ సమస్య కోసం కడదాకా పోరాడలేకపోతున్నాడు. దీంతోనే ఆయనపై ట్విట్టర్‌పులి అనే విమర్శలు వస్తున్నాయి. ఉద్దానం కిడ్నీ బాధితుల బాథలను ప్రస్తావించాడు. దాంతో ప్రభుత్వంలో కాస్తైనా కదలిక వచ్చింది. కానీ ఇప్పటికీ ఈ సమస్యలకు ప్రభుత్వం పూర్తి పరిష్కారాన్ని చూపించడంలో అలసత్యం వహిస్తూనే ఉంది. ఇక ఈ సమస్యపై పవన్‌ కూడా తాను ఒక నిపుణుల కమిటీనీ వేశానని, 15రోజుల్లో ఆ కమిటీ నివేదిక ఇస్తుందని, తదుపరి తన కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపాడు. కానీ ప్రభుత్వం వేసిన కమిటీతో పాటు పవన్‌ పంపిన నిపుణుల కమిటీ ఇప్పటివరకు ఏమి తేల్చిందో పవన్‌గానీ, చంద్రబాబు, కామినేని శ్రీనివాస్‌లుగానీ చెప్పలేకపోతున్నారు. ఇక అక్వాకు సంబందించిన పరిశ్రమలతో తమ పంటలు కలుషితమైపోతాయని కొందరు రైతులు పవన్‌ వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. పోలవరం, రాజధాని భూముల రైతులు, తనను కలిసిన చేనేత కార్మికులు.. ఇలా వీరందరి సమస్యలపై పవన్‌ స్పందిస్తున్నాడు. కానీ ఆ సమస్యలను తదుపరి విస్మరిస్తున్నాడు. ఆ సమస్యల అంతానికి తుది వరకు పోరాడ లేకపోతున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరికంటా పోరాడి ప్రాణాలను సైతం త్యాగం చేసిన వారే నిజమైన నాయకులవుతారనే విషయం ఆయన విస్మరిస్తున్నాడు. 

కానీ ఇక్కడ పవన్‌ పరిమితులను కూడా మనం అర్ధం చేసుకోవాలి. ఆయన ఇంకా పార్టీని పూర్తిస్థాయిలో నిర్మించలేదు. సంస్థాగతంగా పటిష్టం చేయలేదు. బలమైన ఆర్థిక బలం ఉన్న టిడిపిని, వైసీపిని ఇప్పుడే ఆయన తుదముట్టించే అవకాశాలు లేవు. ఈ విషయాన్ని ఆయన కూడా పలుసార్లు వ్యక్తం చేశాడు. ముఖ్యంగా రాజకీయసభలు పెట్టాలన్నా, కార్యాచరణ రూపొందించాలన్నా నేటిరోజుల్లో ఆర్థిక పరిపుష్టి అవసరం. పవన్‌ సన్నిహితుల సమాచారం ప్రకారం ప్రస్తుతం పవన్‌ తీవ్ర ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నాడు అనేది వాస్తవమే అని తెలుస్తోంది. తాను విడాకులిచ్చిన మాజీ భార్యలకు ఆయన పెద్దమొత్తంలో భరణం ఇచ్చాడని సమాచారం. మరో వైపు నిర్మాతగా కూడా నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయనకున్న ఒకే ఒక్క ఆదాయమార్గం సినిమా నటన మాత్రమే. అవి చేయకపోతే ఆయన సంపాదించలేడు. కాబట్టే ఇష్టంలేకపోయినా కూడా ఇప్పటికీ సినిమాలలోనే కొనసాగుతున్నాడు. ఇప్పుడు అవి కూడా చేయకపోతే కష్టం. ఆయన కోసం, ఆయన పార్టీకోసం నిధులు , విరాళాలు కూడా పెద్దమొత్తంలో వచ్చే అవకాశం లేదు. పివిపి వంటి వాడిని కూడా తన ముక్కుసూటితనంతో పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు రెండు పడవల ప్రయాణం చేయకతప్పదు. అందువల్ల ఆయన ఎక్కువగా సినిమాలకే సమయం కేటాయిస్తున్నట్లు అర్థమవుతోంది. దానివల్లే ప్రస్తుతం ఆయన ఏ సమస్యలను తుదికంటా పోరాడలేకపోతున్నాడనే వాదన కూడా ఉంది. మరి వీటిలో నిజానిజాలెంతో పవన్‌కే తెలియాలి. ఇక పవన్‌ త్వరలో జరగనున్న ఆర్కేబీచ్‌లోని మేథావుల దీక్షకు మద్దతు ఇస్తాడో లేదో? అలాగే మిగిలిన విషయాలలో ఆయన సూటిగా తన పరిస్థితిని, లిమిట్స్‌ను చెప్పగలిగితేనే ఆయనపై అందరికీ నమ్మకం వస్తుంది. అది చేయనంత కాలం ఆయనపై విమర్శలు తప్పవు.. అనేది వాస్తవం. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement