Advertisement

బాబుకు రోజుకో కొత్త తలనొప్పి!


విశాఖపీఠం పీఠాధిపతి స్వరూపానంద్రేంద్ర స్వామి జగన్‌కు కోవర్ట్‌ అంటూ టిడిపి నాయకులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన టిడిపి పార్టీ ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు పాల్పడుతోందని, ఎన్నికల ముందు బ్రాహ్మణుల ఓట్ల కోసం తన చుట్టూ తిరిగిన టిడిపి నాయకులు ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు బ్రాహ్మణుల ఓట్ల కోసం బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇప్పుడు మాత్రం దాన్ని పట్టించుకోవడం లేదని, ఏదో నామమాత్రపు నిధులతో దాని ఏర్పాటు చేశారని స్వరూపానంద్రేంద్ర స్వామి టిడిపిపై మండిపడ్డారు. వాస్తవానికి స్వామి మాటల్లో కూడా వాస్తవం ఉంది. దీంతో ఆయన్ను ఏమి అనలేని పరిస్థితుల్లో టిడిపి నాయకులు తలపట్టుకుంటున్నారు.

Advertisement

మరోవైపు ఎస్సీ వర్గీకరణ కోసం మరోసారి ఎమ్మార్పీఎస్‌ నాయకుడు మందకృష్ణ మాదిగ.. చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సుముఖంగా ఉన్నానని చెప్పి, తమ ఉద్యమానికి మద్దతు పలికిన చంద్రబాబు ఇప్పుడు ఆ విషయమే పట్టించుకోవడం లేదని ఎమ్మార్పీయస్‌ నాయకులు భగ్గుమంటున్నారు. తెలంగాణలో, ఉమ్మడి రాష్ట్రంలో మాదిగల జనాభాశాతం ఎక్కువని, అందుకే అప్పుడు చంద్రబాబు తనకు మద్దతు పలికారని, కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో మాదిగల కంటే మాలల జనాభానే ఎక్కువకావడంతో చంద్రబాబు మాట తప్పుతున్నారని మాదిగలు మండిపడుతున్నారు. దీంతో 30వ తేదీన నారా వారి పల్లె నుండి ఎమ్మార్పీయస్‌ ఉద్యమ యాత్ర మొదలుపెడతామంటూ వారు బాబుకు అల్టిమేటం ఇస్తున్నారు.

ఇంకో వైపు కాపులకు కాపు భవనాలు నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు ఆ భవనాలకు చంద్రన్న భవనాలు అనే పేరును పెట్టాలని నిర్ణయించుకోవడంతో కాపులు భగ్గుమన్నారు. సొంతపార్టీ నేతలు కూడా బాబు నిర్ణయాన్ని తప్పుపట్టారు. దీనివల్ల కాపుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భవనాలకు శ్రీకృష్ణదేవరాయలు, ఎస్వీరంగారావు, సావిత్రి, రఘుపతి వెంకయ్యనాయుడు వంటి కాపు మహానుభావుల పేర్లు పెట్టాలని కొందరు ఆందోళన మొదలుపెట్టారు. మొత్తానికి తప్పు తెలుసుకున్న చంద్రబాబు కాపు భవనాలకు కాపు పెద్దలు సూచించిన పేర్లనే పెట్టాలని నిర్ణయం మార్చుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఇలా బాబుకు రోజుకో కొత్త తలనొప్పి వచ్చిపడుతోంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement