పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జైలు నుంచే తన నెట్‌వర్క్‌ను నడుపుతూ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ .. అతని కుటుంబ సభ్యులను బహిరంగంగానే బెదిరించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల సల్మాన్ ఖాన్ సన్నిహితుడు, రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందని తేలడం.. అలాగే ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టికి కూడా హెచ్చరికలు జారీ చేయడం వంటి వరుస ఘటనలు సామాన్య ప్రజలను, సినీ వర్గాలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో బిష్ణోయ్ జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా రూపొందిన ఒక డాక్యు-సిరీస్ `లారెన్స్ ఆఫ్ పంజాబ్` విడుదలకు సిద్ధమవ్వడం కొత్త వివాదానికి తెరలేపింది. ఈ సిరీస్ నేర ప్రపంచాన్ని, గ్యాంగ్‌స్టర్ సంస్కృతిని గ్లామరైజ్ చేసే విధంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, యువత తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ సరిహద్దు రాష్ట్రం కావడంతో ఇటువంటి కంటెంట్ ప్రభావంపై అధికారులు నిఘా పెంచారు.
ఈ డాక్యు-సిరీస్ ప్రసారాన్ని అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం.. పలువురు ప్రముఖులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీనిపై జీ5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌కు వ్యతిరేకంగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. భావప్రకటనా స్వేచ్ఛ - సృజనాత్మకత పేరిట నేరస్తుల జీవితాలను ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమనే అంశంపై ప్రస్తుతం కోర్టుల్లో వాదనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన అడ్వైజరీ మరియు పిటిషన్ల నేపథ్యంలో ఈ వివాదాస్పద సిరీస్ విడుదల అవుతుందా లేదా అనేది ఇప్పుడు న్యాయస్థానాల తీర్పుపై ఆధారపడి ఉంది.