ప్రస్తుతం పరిశ్రమలో స్పై థ్రిల్లర్స్ సినిమాలదే హవా అనడంలో ఎలాంటి సందేహం లేదు. `ధురందర్` సిరీస్ సాధించిన అసాధారణ విజయం దేశవ్యాప్తంగా గూఢచారి కథలపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసింది. ఇటీవల విడుదలైన `ధురందర్: ది రివెంజ్` వారం రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డులు సృష్టించడంతో స్పై సినిమాల గ్రాఫ్ మార్కెట్‌లో అమాంతం పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం బాలీవుడ్‌కే పరిమితమైన ఈ జోనర్, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ సానుకూల వాతావరణం కోలీవుడ్ స్టార్ కార్తీ నటిస్తోన్న `సర్దార్ 2` చిత్రానికి కొండంత అండగా నిలవబోతోంది. గతంలో `సర్దార్` మొదటి భాగం తమిళంలో హిట్టయినా? తెలుగులో ఆశించిన ప్రభావం చూపలేకపోయింది. అయితే `ధురందర్` చిత్రాల పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులు స్పై స్టోరీలలోని లోతును ఆ ఉత్కంఠను బాగా ఓన్ చేసుకున్నారు. దీంతో `సర్దార్ 2`పై అంచనాలు పీక్స్‌కు చేరాయి. దర్శకుడు పి.ఎస్. మిత్రన్ ఈ చిత్రాన్ని మొదటి భాగం కంటే రెట్టింపు బడ్జెట్‌తో భారీ యాక్షన్ సన్నివేశాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
స్పై జోనర్‌కు ఇప్పుడున్న డిమాండ్‌ను బట్టి చూస్తే `సర్దార్ 2`కు తెలుగులో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు పంపిణీదారులు ఈ సినిమా రైట్స్ కోసం భారీగా పోటీ పడుతుండటం విశేషం.
వాస్తవానికి ఈ చిత్రాన్ని గత ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఆ వాయిదా సినిమాకిప్పుడు కలిసొస్తుంది. `సర్దార్ 2` కి హిట్ టాక్ వచ్చిందంటే? కార్తీ కెరీర్ లో భారీ వసూళ్ల చిత్రంగా నిలిచిపోతుంది.