యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో భారీ యాక్షన్ థ్రిల్లర్ గా `డ్రాగన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్ ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ ఇస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌లో పట్టాలెక్కిన ఈ చిత్రం ఏడాది కాలం గడిచినా ఇప్పటి వరకు కేవలం 40 శాతం మాత్రమే పూర్తయిందని సమాచారం. నీల్ ప్రతి ఫ్రేమ్‌ను అత్యంత పకడ్బందీగా, క్వాలిటీతో చెక్కే క్రమంలోనే ఈ ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం వందల రోజులు వెచ్చిస్తుండటంతో ఇంకా 60 శాతం భాగం షూటింగ్ బాకీ ఉండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇలా నత్తనడకన సాగుతున్న షూటింగ్ కారణంగా సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. తొలుత 2026 ప్రథమార్ధంలోనే సినిమాను తీసుకురావాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2027 వరకు వెయిట్ చేయక తప్పదనిపిస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తన ఫిజిక్ , మేకోవర్ విషయంలో తీసుకుంటున్న ప్రత్యేక జాగ్రత్తలు కూడా సమయం పెరగడానికి ఓ కారణంగా చెప్పొచ్చు. అయితే ఇంతటి సుదీర్ఘ నిరీక్షణ అభిమానుల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే తారక్ హుటాహుటిన పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లు కొన్ని ఉన్నాయి.
`డ్రాగన్` ఆలస్యం వల్ల `దేవర 2` పై భారీ ప్రభావం పడుతుంది. `దేవర` పార్ట్ 1పై వచ్చిన విమర్శలను చెరిపేస్తూ రెండో భాగంతో గట్టి హిట్ కొట్టాలని దర్శకుడు కొరటాల శివ ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం తారక్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. తాజా ప్రచారంతో ఎన్టీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడో తెలియని సందిగ్ధంలో కొరటాల టీమ్ లో మొదలవుతుంది. ఈ జాప్యం వల్ల `దేవర 2` మరింత వెనక్కి వెళ్లే సూచనలున్నాయి. ఎన్టీఆర్ తన కాల్షీట్లను ఎలా సర్దుబాటు చేస్తారో? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అలాగే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ విషయంలోనూ హీరో ఎన్టీఆర్? అల్లు అర్జున్ నా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.