బాలీవుడ్ నటి జాన్వీకపూర్ సొంత పరిశ్రమలో ఇప్పటి వరకూ చాలా సినిమాలు చేసింది. దాదాపు 15 సినిమాల వరకూ హిందీలోనే చేసింది. కానీ అభిమాన నటుడితో కలిసి పనిచేసే అవకాశం మాత్రం రాలేదు. ఆ సిని మాలన్నింటిలో వేర్వేరు హీరోలతో నటించింది కానీ తాను కోరుకున్న నటుడు మాత్రం వాటిలో ఎక్కడా భాగమవ్వలేదు.
జాన్వీ బాలీవుడ్కి ఎంటర్ అయి ఆరేళ్లు దాటింది. అయితే ఇప్పుడా ఛాన్స్ ఎట్టకేలకు వచ్చేసింది. తన ఫేవరెట్ స్టార్ తో నటించే అవకాశం అమ్మడు ఒడిసి పట్టుకుంది. ఇంతకీ ఎవరా? అభిమాన నటుడు? అంటే వివరాల్లోకి వెళ్లా ల్సిందే. రాక్ స్టార్ రణబీర్ కపూర్. అవును ఇతడితో కలిసి సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటుంది.
కానీ ఆ ఛాన్స్ రావడం లేదు. ఇప్పుడా ఆ అవకాశం దర్శకుడు మోహిత్ సూరి రూపంలో దక్కింది. రణబీర్ కపూర్ హీరోగా ఓ గ్యాంగ్ స్టార్ మ్యూజికల్ లవ్ స్టోరీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు మోహిత్. వాస్తవానికి మోహిత్ సూరి కూడా చాలా కాలంగా రణబీర్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. కానీ రణబీర్ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటంతో సాధ్యపడలేదు.
ఇంత కాలానికి ఆ కాంబినేషన్ సెట్ అయింది. ఇందులో హీరోయిన్ గా జాన్వీకపూర్ ను తీసుకున్నట్లు తెలిసింది. కొత్త భామకు అవకాశం ఇవ్వడం కంటే కోస్టార్ తన అభిమాన నటుడైతే బాగుంటుందని భావించి జాన్వీని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.