ఇటీవల రామ్ చరణ్ కి కవలలు జన్మించడంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసిన సంగతి తెలిసిందే. చరణ్- ఉపాసన దంపతులకు ఇప్పుడు ముగ్గురు వారసులు. క్లిన్ కారా తర్వాత కవలల జననం(మగ పిల్లాడు, ఆడపిల్ల)తో ఆ ఇల్లు అంతా సందడిగా మారింది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ ఆనంద సమయంలో అపోలో సంస్థానం పరిసరాల్లో ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే.
అయితే ఇదే సమయంలో ఓ జర్నలిస్ట్ మెగాస్టార్ చిరంజీవిపై చేసిన ఓ కామెంట్ హాట్ టాపిగ్గా మారింది. ఈ హడావుడి అంతా ఆడపిల్ల (క్లిన్ కారా) జన్మించినప్పుడు లేదు.. ఇప్పుడు మగపిల్లాడు జన్మించగానే చిరంజీవి ఇంట హడావుడి నెలకొంది! అనే అర్థంలో అతడు చేసిన కామెంట్ ఇప్పుడు నెటిజనుల్లో చర్చగా మారింది. అయితే ఇలాంటి సమయంలో అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం జర్నలిస్టుకు ఏంటి? అంటూ మెగా కోడలు లావణ్య త్రిపాఠి మీడియా ఎదుట ప్రశ్నించారు. మా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదని సూటిగా హెచ్చరించారు. మాట్లాడేప్పుడు ఆచితూచి వ్యవహరించాలని కూడా సదరు జర్నలిస్టుకు సూచించారు. అతడి వ్యాఖ్యలు అతడి చెత్త అభిరుచిని చూపిస్తున్నాయని అసహనం వ్యక్తం చేసారు.