ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జనవరి 19 నుంచి దావోస్‌లో పర్యటిస్తున్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటుగా విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొంటున్నారు. అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలను కలవడంతో పాటు అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే పనిలో బిజీగా వున్నారు.
CII ఆధ్వర్యంలో జరిగిన జియోగ్రఫీ ఆఫ్ గ్రోత్-ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అనే సెషన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు, నారా లోకేష్ సంయుక్తంగా అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతూ ఏపీ కేవలం పెట్టుబడులకు గమ్యస్థానం మాత్రమే కాదని, అది ఒక వ్యూహాత్మక ప్రయోజనమని వివరిస్తున్నారు.
ఇండియా కి వచ్చే మొత్తం విదేశీ పెట్టుబడులలో చాలావరకు ఏపీ నుంచే వస్తోందని, వ్యాపార నిర్వహణలో తమ ఆలోచనలు, తమ స్పీడు అన్ని రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేలా చేశాయని చంద్రబాబు ఈ సందర్భంగా వేదికపై మట్లాడారు. స్విట్జర్లాండ్, యూఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భారతదేశ ఆర్థిక భవిష్యత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో విశ్లేషించారు. ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, మరో 2-3 ఏళ్లలో మూడో స్థానానికి, 2047 నాటికి మొదటి స్థానానికి చేరుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.