2027 వేసవి కాలం తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ - చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయేలా సన్నివేశం కనిపిస్తోంది. సంక్రాంతిని మించిన సందడిని వేసవి తలపించేలా ఉంది. మార్చి నుండి మే వరకు భారీ చిత్రాలు క్యూలో కనిపిస్తున్నాయి. ఓసారి వాటి వివరాల్లోకి వెళ్తే ఎస్.ఎస్. రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న`వారణాసి` ముందుగా రిలీజ్ కానుంది.ఈ ప్రతిష్టాత్మక చిత్రం శ్రీరామనవమిని పురస్కరించుకుని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
పాన్ వరల్డ్ లో ఏకంగా 120 దేశాల్లో ఒకేసారి రిలీజ్ చేయాలన్నది ప్లాన్. అనంతరం ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపొందుతున్న `స్పిరిట్` సైతం అంతే భారీ అంచనాల మద్య వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వేసవి రేసులో డేట్ లాక్ చేసుకున్న మొదటి పెద్ద సినిమా ఇదే. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కూడా వేసవి విండోనే ఖరారు చేసుకున్నట్లు సమాచారం.
నీల్ నుంచి `కేజీఎఫ్`, `సలార్` లాంటి భారీ విజయాల తర్వాత రిలీజ్ అవుతోన్న చిత్రం కావడంతో అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఇంకా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కూడా గ్లోబల్ స్థాయిలో రిలీజ్ అవుతుంది. అలాగే బన్నీ లోకేష్ కనగరాజ్ తో చేసే సినిమా కూడా అదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో 2027 లో బన్నీ నుంచి రెండు సినిమాలు రేసులో ఉన్నట్లే. ఈ నాలుగు భారీ చిత్రాలు గనుక రెండు నెలల వ్యవధిలో విడుదలైతే, భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద బాక్సాఫీస్ విస్ఫోటనం తప్పదు.