తనదైన అందం, ప్రతిభతో మెప్పిస్తోంది తారా సుతారియా. కరణ్ జోహార్ `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` చిత్రంతో కథానాయికగా ఆరంగేట్రం చేసింది. కెరీర్ లో వరుస చిత్రాల్లో నటించినా ఆశించిన విజయాలు దక్కలేదు. అయినా పట్టు విడవక అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం యష్ కథానాయకుడిగా నటిస్తున్న `టాక్సిక్` లో కీలక పాత్రలో నటించింది. ఇటీవల విడుదలైన తారా ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తనకు బిగ్ బ్రేక్ నిస్తుందని భావిస్తోంది.
మరోవైపు తారా సుతారియా వ్యక్తిగత జీవితం నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. తారా కొంతకాలంగా సహనటుడు వీర్ పహారియాతో డేటింగ్ లో ఉన్నారు. అయితే రకరకాల కారణాలతో ఈ జంట విడిపోయిందని తాజాగా పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఇటీవల గాయకుడు ఏపీ థిల్లాన్ ఓ లైవ్ కార్యక్రమంలో తారా బుగ్గపై ముద్దు పెట్టుకున్న వీడియో ఇంటర్నెట్ లో వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనకు అక్కడే ఉన్న వీర్ పహారియా తీవ్రంగా కలత చెందాడని, ఆ తర్వాత తారా- వీర్ మధ్య అంతా చెడిందని పుకార్లు షికార్ చేసాయి. అయితే తారా, వీర్ వేర్వేరు ప్రకటనల్లో దానిని ఖండించారు.
కానీ ఇప్పుడు నుపుర్ సనన్ - స్టెబిన్ బెన్ వివాహ రిసెప్షన్ వేడుకకు వీర్ పహారియా ఒంటరిగా హాజరవ్వడం, వేడుకలో ఎక్కడా తారా సుతారియా కనిపించకపోవడంతో ఈ జంట విడిపోయిందన్న పుకార్లకు బలం చేకూరింది. రిసెప్షన్ లో వీర్ తన స్నేహితులతో కాలక్షేపం చేసాడు. ఏదో వెలితిగా కనిపించాడు. దీంతో నెటిజనుల్లో గుసగుసలు మొదలయ్యాయి. కొంతకాలంగా వీర్- తారా జంట సోషల్ మీడియాల్లో ఒకరినొకరు అనుసరించడం లేదు. జంటగా కలిసి ఉన్న కొన్ని పాత ఫోటోలను కూడా డిలీట్ చేసారు. ఇవన్నీ ఈ జంట విడిపోయారనడానికి సింబాలిక్ అని రెడ్డిటర్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ సోలో వెకేషన్ ఫోటోలను మాత్రమే షేర్ చేస్తున్నారు.