ఇండస్ట్రీలో అత్యంత వేగంగా స్టోరీలు రాసి షూటింగ్ పూర్తిచేసే దర్శకుడు ఎవరు? అంటే డ్యాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాధ్ పేరు చెబుతారు. కానీ ఇప్పుడా స్థానాన్ని హిట్ మెషిన్ అనీల్ రావిపూడి కబ్జా చేసేసాడు. పూరిని మించిన వేగంగా సినిమాలు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఇతడికే చెల్లిందిప్పుడు. అనీల్ స్టోరీ రాయడానికి పెద్దగా సమయం తీసుకోడు. మహా అయితే మూడు నెలలు వైజాగ్ పార్క్ హోటల్ లో బీచ్ ముందు సిట్టింగ్ వేసాడంటే స్టోరీ రెడీ అయిపోతుంది.
అందుకోసం విదేశాలకు వెళ్లాల్సిన పనిలేదు. ఖండాలు దాటిపోవాల్సిన పనిలేదు. బ్యాంకాక్ బీచ్ ముందు వాలిపోవాల్సిన పనిలేదు. అనీల్ డైరెక్టర్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే? ఒకే ఒక్క సినిమా కథకు మూడు నెలలు సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత మిగతా కథలన్నీ రెండు నెలల్లోపే పూర్తి చేసాడు. వందల కోట్ల వసూళ్లు వాటితోనే సాధించాడు. కథల పరంగా నేల విడిచి సాము చేయడు. సింపుల్ స్టోరీతో రికార్డులు రాయడం అనీల్ కే సాధ్యమైంది.
ఇటీవలే రిలీజ్ అయిన `మనశంకర వరప్రసాద్ గారు` స్టోరీ 25 రోజుల్లోనూ పూర్తి చేసాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. తదుపరి చిత్రం కోసం రెండు..మూడు వారాలు గ్యాప్ తీసుకుని మళ్లీ బరిలోకి దిగిపోతాడు. మరి ఈ సినిమా కోసం అనీల్ తీసుకునే సమయం ఎన్ని నెలలు అంటే? రఫ్ గా 50 రోజులు ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. 10వ సినిమా ప్రత్యేకంగా ఉండాలి..ఎక్కువ సమయం తీసుకుని చెక్కాలి వంటి ఆలోచనలు లేకుండా? 50 రోజుల్లోనే స్టోరీ సిద్దం చేయాలని అనీల్ భావిస్తున్నాడుట.