హిట్ మెషిన్ అనీల్ రావిపూడి వరుసగా తొమ్మిది విజయాలతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసాడు. దర్శకశిఖరం రాజమౌళి తర్వాత అంతటి వాడిగా అనీల్ నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన `మనశంక రవప్రసాద్ గారు` కూడా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో అనీల్ 10వ చిత్రంపై చర్చ మొదలైంది. రెండు వారాల విశ్రాంతి అనంతరం అనీల్ మళ్లీ వర్క్ మోడ్ లోకి వెళ్లిపోతానన్నాడు. తదుపరి ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అవుతాడు.
అయితే ఇప్పుడతడి హీరో ఎవరు? అన్నదే ఆసక్తికరంగా మారింది. కింగ్ నాగార్జునతో ఓ ప్రాజెక్ట్ ఉంటుందనే చర్చ కొన్ని నెలలుగా జరుగుతుంది. ఈ విషయంలో అనీల్ కూడా పాజిటివ్ గానే ఉన్నాడు. నాగార్జున నుంచే క్లియరెన్స్ రావాల్సి ఉంది. అయితే అంతకన్నా ముందే ఆ వరుసలో పవర్ స్టార్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. అనీల్ తదుపరి సినిమా పవన్ తో లాక్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
దిల్ రాజు నిర్మాణంలో అనీల్ ఓ ప్రాజెక్ట్ కి కమిట్ మెంట్ ఉంది. అలాగే రాజుగారితో పవన్ కళ్యాణ్ కి కూడా ఓ కమిట్ మెంట్ ఉంది. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన `వకీల్ సాబ్` సమయంలోనే పవన్-దిల్ రాజు మధ్య కమిట్ మెంట్ జరిగింది. కానీ పవన్ కు ఇతర సంస్థలతోనూ కమిట్ మెంట్లు ఉండటంతో వీలు పడలేదు. ఈ నేపథ్యంలో రాజుగారు అనీల్ -పవన్ కాంబినేషన్ సెట్ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఫిలిం సర్కిల్స్ లో డిస్కషన్ జరుగుతోంది.
ఇప్పటి వరకూ వారిద్దరు కూడా కలిసి పని చేయలేదు. పవన్ కళ్యాణ్ కి కూడా సరైన కమర్శియల్ హిట్ పడి చాలా కాలమవుతోంది. ఈ మధ్య కాలంలో పవన్ నటిస్తోన్న సినిమాలకు బడ్జెట్ ఎక్కువవుతోంది అన్న విమర్శ కూడా ఉంది. అనీల్ తో ఓ సినిమా చేస్తే పవన్ ఆ విమర్శకు చెక్ పెట్టొచ్చు. ఈ పాయింట్ ను దిల్ రాజు పీకే వద్ద రెయిజ్ చేసినట్లు ఇన్ సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. మరి పవన్ ఏమంటారో చూడాలి.