సినీజోష్ రివ్యూ : మన శంకర వర ప్రసాద్ గారు
నటీనటులు : చిరంజీవి, వెంకటేష్ (ప్రత్యేక పాత్ర), నయనతార, కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శ్రీనివాసరెడ్డి తదితరులు
ఎడిటింగ్ : తమ్మిరాజు
ఫోటోగ్రఫీ : సమీర్ రెడ్డి
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
నిర్మాతలు : సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
దర్శకత్వం : అనిల్ రావిపూడి
విడుదల తేదీ : 12-01-2026
కమర్షియల్ సక్సెస్సులకి
కేరాఫ్ అడ్రస్ గా మారి
కాంపిటీషన్ లేని స్టార్ డమ్ కి
ఎగ్జాంపుల్ గా నిలిచి
గత నాలుగు దశాబ్దాలుగా
చిన్నలనీ, పెద్దలనీ
రంజింపజేస్తూ
జీవిస్తోన్న
విలక్షణ నటుడు.. మెగాస్టార్ చిరంజీవి
పొలిటికల్ జర్నీ ముగించి రీ ఎంట్రీ ఇచ్చాక చిరంజీవి నుంచి ఖైదీ 150 , వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్స్ అయితే వచ్చాయి కానీ అవి మునుపటి మెగాస్టార్ మెరుపులను పూర్తి స్థాయిలో చూపలేకపోయాయి. సరిగ్గా అదే పాయింట్ పట్టుకున్నారు అనిల్ రావిపూడి. అభిమానులకి ఏం కావాలో గ్రహించారు. ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో అంచనా వేశారు. చిరంజీవి అసలు పేరునే సినిమా టైటిల్ గా పెట్టేసారు. పండక్కి వస్తున్నారు అని ప్రకటించి మరీ పసందైన వినోదాల విందుని సిద్ధం చేసి పట్టుకొచ్చారు. మరిక లేటెందుకు.. మన వరప్రసాద్ గారు ఏ ఏ వంటకాలతో వచ్చారో, ఎలాంటి విందు భోజనం తెచ్చారో తెలుసుకుందాం రండి.
వినోదాల విస్తరి : కథ కోసం పెద్ద కాంప్లికేటెడ్ మ్యాటర్ కానీ, అద్భుతాలు చేసెయ్యాలనే ఆశల మూటని కానీ నెత్తికెత్తుకోలేదు జనం పల్స్ పట్టుకోవడంలో రాటుదేలిపోయిన రావిపూడి. జస్ట్.. విడాకులు తీసుకుని విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ ఎలా కలిసిపోయారు అనే అంశంతోనే వినోదాల విస్తరిని పరిచేసారు.
అలరించే దృశ్యాల అరిసెలు : వినోదమే ప్రధానమని హింట్ ఇచ్చేలా.. మాస్ ని ఉర్రుతలూగించే బాస్ ఇంట్రో ని సింపుల్ గా, సరదాగా కానిచ్చేస్తూనే కావాల్సిన ఎలివేషన్ ఇచ్చేసిన అనిల్ రావిపూడి ఆపై మాంచి కిక్కిచ్చే ఫైటు, హుక్కు స్టెప్పు పాటతో అభిమానులు ఆత్రంగా ఎదురుచూసే అరిసెలు అందించేసారు.
సున్నిత సన్నివేశాల సున్నుండలు : ఎంతటి మెగాస్టార్ అయినా ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. అది బ్యాలెన్స్ చేయడమే కాకుండా, అసలా సంగతే గుర్తుకురాకుండా చిరు - నయన్ ల మధ్య మాటలే లేని సున్నిత సన్నివేశాల సున్నుండలతో తెరపై తీయని ప్రేమకథ రుచి చూపించారు.
లేత మనసుల పూతరేకులు : తన పిల్లలకి దగ్గరవ్వాలనే శంకర వరప్రసాద్ తపనని చూపిస్తూనే ఆ పిల్లల స్వభావాన్ని, వారి పూత రేకుల్లాంటి లేత మనసులని ఆవిష్కరించిన తీరు, ముఖ్యంగా పిల్లలతో పాట, బ్రెడ్ ఆమ్లెట్ సీన్ అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుంది.
మామ అల్లుళ్ళ కోడి పుంజుల కోలాటం : మామా - అల్లుడు గొడవ పడితే మాటా మాటా అనుకోవడం మాములే. కానీ ఇక్కడ అల్లుడు ఆ మామకి OTP ఇస్తాడు. అందుకు ప్రతిగా మామ కవిత రాసి మరీ దరువులతో పాటగా పాడుతాడు. దానికి అల్లుడు గిల్లుడే ఈ సినిమాకి ఇంటర్వెల్ కార్డు. ఆ మామా అల్లుళ్ళ కోడిపుంజుల్లాంటి కొట్లాటలో ఫుల్ ఫన్ గ్యారంటీ.
మెగాస్టారే స్వయంగా కలిపిన పులిహోర : విడాకులు తీసుకుని విడిపోయిన భార్య తనపై విసుక్కుంటూ వుంటే భర్తలోని అహం కసురుకుంటుంది.. కస్సుమంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ కలిసిపోదామని కాకాపడుతూ, ఆ మీసాల పిల్లతో స్వయంగా మెగాస్టారే కలిపిన పులిహోర రుచిని ఆస్వాదించి తీరాల్సిందే.
పట్టువిడుపులే అసలైన పాయసం : చిన్న చిన్న కారణాలతోనే భార్యాభర్తల బంధానికి బై బై చెప్పేస్తున్న నేటి తరం జంటలకు కనువిప్పు కలిగేలా, కనీసం ఆ ఆలోచన మెదిలేలా అత్తా కోడళ్ల మధ్య ఒక చిన్న కాన్వర్సేషన్ ని భలేగా కన్సీవ్ చేసారు అనిల్ రావిపూడి. పట్టు విడుపుల ధోరణే దంపతుల పాలిట పాయసమనే సూక్తిని క్లుప్తంగా చెప్పేసారు.
పోరాటాల కూరలతో ఘుమఘుమలాడే గారెలు : సంక్రాంతికి కనుమ, ముక్కనుమ తోడున్నట్టు, కక్కా - ముక్కా కావాల్సిందే అన్నట్టు - అంతా తీపే అయితే పండగ పూర్తవదు కనుక మాస్ కి కావాల్సిన మసాలాని దట్టించి పోరాటాల కూరలతో ఘుమఘుమలాడే గారెలనూ వడ్డించారు దర్శకుడు రావిపూడి.
చిరు - వెంకీ ఎగరేసిన పాటల పతంగులు : అందరు అనుకున్నట్టే ముందునుంచీ చిరు తన టైమింగ్ తో చితగ్గొడుతుంటే.. చివర్లో వెంకీ దిగి తన స్టైల్ లో విరగ్గొట్టేసారు. తెరపై వీరిద్దరూ కలిసి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఒకరి హిట్ సాంగ్ కి మరొకరు డ్యాన్స్ చేస్తూ పాటల పతంగులు ఎగరేసి సంక్రాంతి సందడిని పదింతలు పెంచేశారు.
సంక్రాంతికి తగ్గ షడ్రసోపేత భోజనం : మొత్తంగా చూసుకుంటే మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి తగ్గ షడ్రసోపేత భోజనాన్ని ప్రేక్షకుల ముందు పెట్టారు. ముఖ్యంగా మెగాభిమానులకైతే భుక్తాయాసం తప్పదు. తాము ప్రాణంగా ప్రేమించిన ఆనాటి చిరంజీవిని మరొక్కమారు తనివితీరా తెరపై చూసుకోవాలని తహతహలాడిన అభిమానుల దాహం తీర్చే తీరుతానంటూ అనిల్ రావిపూడి అత్యంత శ్రద్దగా చెక్కిన చిత్రమిది. ఇందులో జ్వాలా జ్వాలా అనే చంటబ్బాయి కనిపిస్తాడు. గోడ బద్దలుకొట్టే గ్యాంగ్ లీడర్ కనిపిస్తాడు. చిలిపిగా వంకర్లు తిరిగే శంకర్ దాదా కనిపిస్తాడు. ఇంటర్వెల్ బ్లాక్ లో ఘరానా మొగుడు ఇలా వచ్చి ఆలా వెళతాడు. అంతెందుకు.. ఫారెస్ట్ ఎపిసోడ్ లో స్వయంగా చిరునే ఇందువదన కుందరదన పాట పాడతారు. రామ్మా చిలకమ్మా, నవ్వింది మల్లెచెండు వంటి క్లాసిక్ సాంగ్స్ కి చిరు - వెంకీ కలిసి చిందేస్తారు. ఇంకా ఇలాంటివి ఎన్నో, ఎన్నెన్నో.!
మెస్మరైజ్ చేసిన మెగాస్టార్ : రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక రెండు, మూడు సూపర్ హిట్స్ వచ్చాయి. తొమ్మిదేళ్లు గడిచాయి. కానీ ఎట్టకేలకు చిరంజీవి తన కంఫర్ట్ జోన్ లోకి వచ్చింది ఈ చిత్రంతోనే. అందుకే తనదైన కామెడీ టైమింగ్ తో చెలరేగిపోయారు. తన మార్క్ మేనరిజమ్స్ తో మెస్మరైజ్ చేసేసారు. డ్యాన్సులు దున్నేశారు - ఫైట్స్ లో కుమ్మేసారు కానీ అంతకుమించి, అసలు అన్నిటినీ దాటి తన లుక్స్ తో అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారనడంలో అతిశయోక్తి లేదు. ఆయన నటన, అయన శైలి, అయన వ్యక్తిత్వమే కాదు ఆయన డిసిప్లిన్ అండ్ డెడికేషన్ కూడా నేటి తరానికి, భావి తరాలకి స్ఫూర్తిదాయకం మరియు మార్గదర్శకం.
పర్ ఫెక్ట్ ఛాయిస్ నయన్ : మెగాస్టార్ కి ధీటుగా నిలవాలంటే లేడీ సూపర్ స్టారే పర్ ఫెక్ట్ ఛాయిస్ అనిపించేలా తన నట నైపుణ్యంతో ఆకట్టుకుంది నయనతార. ప్రేమ, పొగరు, అహం, దర్పం, భార్యత్వం, మాతృత్వం అన్నీ కలగలిసిన ఆ శశిరేఖ పాత్రలో మరింకెవ్వరినీ ఊహించుకోలేనంతగా ఫిట్ అయింది నయనతార. కొన్ని సన్నివేశాల్లో ఆమె హావభావాలు నేటి నటీమణులకు పాఠాలు. మరీ ముఖ్యంగా ప్రసాద్ - శశిరేఖల మూడో కలయికలో సుందరి పాట రాలేదని ప్రసాద్ సందేహిస్తుంటే ఉన్నట్టుండి అదే పాట వినిపించే సందర్భంలో కళ్ళతోనే నయన్ నవ్విన నవ్వు ఎన్నిసార్లు చూసినా తనివితీరదేమో అనిపించేలా ఉంటుంది.
అడిషనల్ స్ట్రెంగ్త్ వెంకీ : తెరపై చిరు - తెరవెనుక అనిల్ కరెక్ట్ కో-ఆర్డినేషన్ తో కామెడీ పండించి ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంటే సంక్రాంతికి వస్తున్నాం హీరో ఆ సరదాని, సందడిని మరింత పెంచేశారు. నిజానికి తనది అంత బలమైన పాత్ర కాకున్నా చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకీ మామ తన ఎనర్జీ తో ఈ చిత్రానికి అడిషనల్ స్ట్రెంగ్త్ అయ్యారు. మెగా - విక్టరీ స్పెషల్ సాంగ్ కోసం ఎదురుచూస్తోన్న ఆడియన్స్ చేత దానికంటే ముందే సాంగ్స్ మెడ్లీతో విజిల్స్ వేయించి క్లాప్స్ కొట్టించేసారు.
అదరగొట్టిన అనిల్ : ఎక్స్ పెరిమెంట్లు చేసెయ్యాలి - ఎక్సట్రార్డినరీగా తీసెయ్యాలి వంటి భేషజాలకు పోకుండా, బలమైన కథ - బరువైన భావోద్వేగాల జోలికి వెళ్లకుండా సంక్రాంతికి సరదాగా నవ్వుకుందాం, మనందరికీ నచ్చేలా వచ్చిన చిరంజీవిని మనసారా చూసుకుందాం అనేలా మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని మలిచారు మన అనిల్ రావిపూడి గారు. ఆడవాళ్లను కాపాడ్డానికి పెట్టిన చట్టాలతో మగాళ్లను కప్పెట్టేస్తారా అంటూ సెటైర్లతో నవ్వించిన అనిల్ అప్పట్లో వెంకీ ఆసనాన్ని పరిచయం చేసినట్టే ఇప్పుడు మందుబాబుల కోసం మధుపానం, మనోధైర్యం, మహదానందం, ధనా ధన్ అనే ప్రారంభ స్తోత్రాన్ని ప్రకటించారు. ముఖ్యంగా చిరు - నయన్ ల ప్రేమ కథను సుందరి సాంగ్ తో లింక్ చేస్తూ తెరకెక్కించిన విధానం, పాటల ప్లేసుమెంట్, ప్రథమార్ధాన్ని పరుగులు పెట్టించిన వైనం అభినందనీయం. ద్వితీయార్ధం కాస్త నెమ్మదించినా వెంకీ రాకతో మళ్ళీ ఊపు తీసుకొచ్చారు కానీ క్లయిమాక్స్ ఫైట్ లో వెంకీ ని ఇన్ క్లూడ్ చేయడం రజనీకాంత్ జైలర్ క్లయిమాక్స్ కి కాపీ పేస్ట్ లా ఉంది. మరి ఆదమరిచారో లేక తెలిసే మలిచారో ఆయనే చెప్పాలి. బై ది వే.. దర్శకుడిగా అపజయమంటూ ఎరుగని అనిల్ రావిపూడి ఈ చిత్రంతో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టిన సందర్భంగా కంగ్రాట్స్.!
అంకితభావంతో యూనిట్ : కేథరిన్, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, జరీనా వాహబ్ మరియు ఇతర నటీనటులందరూ పాత్రోచితంగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ తనకు దక్కిన మెగా ఆపర్చ్యునిటీని చక్కగా వినియోగించుకున్నాడు. అన్ని పాటలనీ చార్ట్ బస్టర్లుగా మలచడంతో పాటు సందర్భోచితంగా మెగా హిట్ సాంగ్స్ ని BGM లో ధ్వనింపచేసి శెభాష్ అనిపించుకున్నాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ మరో హైలైట్. పండగ రిలీజ్ టార్గెట్ తో, పక్కా ప్రణాళికతో, వేగంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా చూసుకున్న సమీర్ మెగాస్టార్ ని మ్యాచోగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ గా తన అనుభవాన్ని చాటుకున్నారు. సెకండాఫ్ లో విషయం తగ్గి సినిమా నెమ్మదించింది కానీ ఆ తప్పు ఎడిటర్ తమ్మిరాజుది కానే కాదు. ఫైట్ మాస్టర్లు బడాయిలకి పోకుండా నమ్మదగ్గ రీతిలోనే కంపోజ్ చేసారు కనుక కంప్లైట్లు రానే రావు. నిర్మాతగా సాహు గారపాటి మరో ఘన విజయమిది. మెగా తనయ సుస్మితకు తొలి విజయమిది.
రిజల్టు ఫిక్స్.. రికార్డులే బ్యాలెన్స్ : ప్రీమియర్ షోస్ నుంచే యునానిమస్ హిట్ టాక్ తెచ్చేసుకున్న మన శంకర వరప్రసాద్ గారు ఈ సంకాంతి బరిలో బాక్సాఫీసుని రఫ్ఫాడించడం ఫిక్స్. ఇక రికార్డులే బ్యాలెన్స్. పండగ సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్సుని థియేటర్లకు లాక్కొచ్చే అంశాలతో పాటు.. అభిమానులు మళ్ళీ మళ్ళీ రిపీట్స్ వేసే పలు ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక కలెక్షన్ల వరద ఖాయం.. కొత్త రికార్డులు తధ్యం అంటోంది ట్రేడ్ రిపోర్ట్. మొత్తానికైతే మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చారు. మెగా జాతర మొదలుపెట్టారు.!
పంచ్ లైన్ : మన శంకర వరప్రద్ గారు - రఫ్ఫాడించారు !
సినీజోష్ రేటింగ్ : 3/5