శ్రీ స్రవంతి మూవీస్ లో త్రివిక్రమ్ రైటర్ గా `నువ్వే కావాలి`, `నువ్వు నాకు నచ్చావ్` లాంటి సినిమాలకు పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో `నువ్వే నువ్వే` సినిమాతో దర్శకుడిగా అదే బ్యానర్ లొ లాంచ్ అయ్యారు. తరుణ్, శ్రియ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయం సాధించింది. తొలి సినిమాతోనే త్రివిక్రమ్ కి దర్శకుడిగా మంచి పేరు వచ్చింది.
అప్పటి నుంచి గురూజీ కెరర్ లో వెనక్కి తిరిగి చూడలేదు. స్టార్ హీరోల టార్గెట్ గా సినిమాలు చేస్తున్నారు. యంగ్ హీరోలు నితిన్ తో కూడా సినిమా చేసారు. కానీ స్రవంతి మూవీస్ వారసుడైన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో మాత్రం గురూజీ ఇంత వరకూ సినిమా చేయలేదు. స్రవంతి మూవీస్ అధినేత రవి కిషోర్ రామ్ కి స్వయానా పెదనాన్న అవుతారు. రామ్ హీరోగా వేర్వేరు దర్శకులతో సినిమాలు కూడా నిర్మించారు.
కానీ గురూజీ మాత్రం వాటిలో ఎక్కడా భాగమవ్వలేదు. మూడేళ్ల క్రితం రామ్ తో సినిమా ఉంటుందని రవికిషోర్ అన్నారు గానీ అది ఇంత వరకూ సాధ్యపడలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు గురూజీ బిజీ షెడ్యూల్ చూసుకుని చేయాల్సి ఉంటుందని అన్నారు. అప్పటి నుంచి మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. మరి రైటర్ గా అవకాశం కల్పించిన గురూజీ ఆ బ్యానర్లో మరో ఛాన్స్ ఎందుకు తీసుకోలేదు అన్న సందేహం లేకపోలేదు.
స్నేహితుడు రాధాకృష్ణను తెరపైకి తెచ్చి ఆయన నిర్మాణంలో త్రివిక్రమ్ సినిమాలు చేస్తున్నారు తప్ప! నిర్మాతగా రవి కిషోర్ కి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. మరి ఈ గ్యాప్ ఏ కారణంగా వస్తున్నట్లు? రవి కిషోర్ ఛాన్స్ ఇచ్చినా? త్రివిక్రమ్ తీసుకోవడం లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే `నువ్వ నాకు నచ్చావ్` రీ రిలీజ్ లో భాగంగా కూడా రవికిషోర్-త్రివిక్రమ్ మీడియా ముందుకొచ్చి ఆ నాటి స్మృతుల్లోకి వెళ్లారు. కానీ చర్చ మధ్యలో ఎక్కడా మళ్లీ కలిసి పని చేస్తామనే మాట రాలేదు.