గత ఏడాది స్టార్ హీరోలు నటించిన చిత్రాలేవి రిలీజ్ కాలేదు. దాదాపు స్టార్లు అంతా ఆన్ సెట్స్ లో ఉండటంతో? రిలీజ్ లు సాధ్యపడలేదు. కానీ 2026 లో మాత్రం అగ్ర హీరోలు కొందరు రెండేసి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన `ది రాజాసాబ్` సంక్రాంతి కానుకగా జనవరి 9న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. హిట్ పై టీమ్ అంతా ఎంతో ధీమాగా ఉంది.
ఈ సినిమా అనంతరం ఆగస్టులో డార్లింగ్ నటిస్తోన్న` పౌజీ` కూడా రిలీజ్ అవుతుంది. స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న రెండు చిత్రాలు రెండు..మూడు నెలల గ్యాప్ లోనే రిలీజ్ అవుతున్నాయి. జనవరి 12న `మనశంకర వరప్రసాద్ గారు` రిలీజ్ అవుతుంది. ఈసినిమా అనంతరం వేసవి కానుకగా ఏప్రిల్ లేదా మేలో `విశ్వంభర` కూడా రిలీజ్ కానుంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడుతోన్న చిత్రాన్ని కచ్చితంగా వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న `ది ప్యారడైజ్` మార్చిలో రిలీజ్ అవుతుంది. పోటీగా `పెద్ది `ఉన్నా నాని ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇదే ఏడాది సుజిత్ ప్రాజెక్ట్ `బ్లడీ రోమియో`ను కూడా ఏడాది ముగింపులో రిలీజ్ చేయాలన్నది నేచురల్ స్టార్ ప్లాన్. `ప్యారడైజ్` రిలీజ్ అనంతరం ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.
అలాగే విక్టరీ వెంకటేష్ కూడా మూడు చిత్రాలతో ప్రేక్షకుల మధ్యలోనే ఉంటారు. `మనశంకర వరప్రసాద్ గారు` లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఆదర్శకుటుంబం హౌస్ 47`ని ఏడాది మిడ్ లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ఇప్పటికే సినిమా సెట్స్ కు వెళ్లింది. అలాగే `దృశ్యం 3` ప్రాజెక్ట్ ని కూడా పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. మాతృక వెర్షన్ ఇదే ఏడాది రిలీజ్ అవుతుండటంతో? తెలుగు వెర్షన్ డిలేకి ఆస్కారం లేదు.