బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటవారసుడు అభిషేక్ బచ్చన్ తన తండ్రి స్థాయిలో రాణించకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ. అభిషేక్ నటుడిగా షైన్ అయినా కానీ, అమితాబ్ రేంజ్ కమర్షియల్ హీరోగా సత్తా చాటలేకపోయాడు. నటవారసులైన రణబీర్ కపూర్, హృతిక్ రోషన్ రేంజ్ స్టార్ కాలేకపోయాడు. ఇది అమితాబ్ అభిమానులలో కలవరాన్ని నింపింది.
అయితే ఇప్పుడు బచ్చన్ ల కుటుంబంలో జోష్ ని నింపుతూ, అమితాబ్ మనవడు అగస్త్య నందా శుభారంభాన్నిచ్చాడు. అతడు నటించిన ఇక్కీస్ క్రిటిక్స్ ప్రశంసలు అందుకోవడమే గాక, బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా వసూలు చేస్తోంది. కెరీర్ ఆరంభమే అగస్త్యకు నటుడిగా మంచి పేరు వచ్చింది. పైగా కమర్షియల్ గా హిట్టు దక్కింది. ఈ విజయం అమితాబ్ బచ్చన్ కుటుంబంలో గొప్ప ఆనందాన్ని నింపింది. ఫ్యామిలీ అంతా ఇప్పుడు సెలబ్రేషన్ మోడ్ లో ఉంది. ఇప్పటికే అమితాబ్, అభిషేక్ ఇద్దరూ అగస్త్య ప్రతిభను కొనియాడారు. అతడు పెద్ద స్టార్ అవుతాడని అభిమానులు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే మీడియాకు అగస్త్య నందా ఊహించని ఝలక్ ఇచ్చాడు. మీరు తాత అమితాబ్ లెగసీ(నటవారసత్వం)ని భారంగా భావిస్తున్నారా? అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. నా ఇంటి పేరు నందా.. నేను నాన్న (నిఖల్ నందా) కు బిడ్డను. ఆయన గర్వపడేలా చేయడం నా మొదటి ప్రధాన్యత అని వ్యాఖ్యానించాడు. అమితాబ్ లాంటి లెజెండ్ తో పోలిక వద్దని కూడా కోరాడు. మామ అభిషేక్ తోను పోల్చవద్దని మీడియాకు సూచించాడు. అతడి డేరింగ్ కామెంట్లు చూస్తుంటే, పిట్ట కొంచెం కూత ఘనం! అని అంగీకరించక తప్పదు. అగస్త్య నందా లాంటి ఛామింగ్ హీరో బాలీవుడ్ లో దూసుకెళ్లేందుకు ఛాన్సుందని అందరూ అంచనా వేస్తున్నారు. అమితాబ్ కుమార్తె శ్వేతానందా కుమారుడు అగస్త్య నందా. అతడు ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో నటనారంగేట్రం చేసాడు. ఇప్పుడు పెద్ద తెరపై ఇక్కీస్ విజయం అతడికి గుర్తింపునిచ్చింది. ఈ చిత్రం ఐదు రోజుల్లో 20 కోట్ల నెట్ వసూలు చేసింది.