పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్లీ బిజీ అవుతున్నారు. అతడు నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్` ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కొత్త సంవత్సరం వేళ సురేందర్ రెడ్డితో సినిమా సెట్స్ పైకి వెళుతుందని కూడా అధికారికంగా ప్రకటించారు.
ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన `ఉస్తాద్ భగత్ సింగ్` రిలీజ్ తేదీని ఖరారు చేసారు. వేసవిలో సినిమా అత్యంత భారీగా విడుదల కానుందని నిర్మాతలు వెల్లడించారు. సమ్మర్ సీజన్ లో పవన్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ కానుంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అతడు ఒక వీధిలో నడుస్తూ స్టైల్ గా కనిపిస్తున్నాడు. ఆ భుజంపై హ్యాండ్‌గన్... ఒక చేతిలో పాతకాలపు క్యాసెట్ రేడియోతో ఉన్న లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. `మైత్రి మూవీ మేకర్స్` నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన మొదటి పాట `దేక్‌లేంగే` సోషల్ మీడియాల్లో వైరల్ గా దూసుకెళుతోంది. ఈ పాట పవన్ ఫ్యాన్స్ లో వేవ్స్ క్రియేట్ చేస్తోంది.