`సంక్రాంతికి వస్తున్నాం` బ్లాక్ బస్టర్ తో విక్టరీ వెంకటేష్ 300 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ వంద కోట్లు కూడా వసూళ్లు సాధించలేని వెంకీ ఖాతాలో ఏకంగా 300 కోట్లు జమా అవ్వడంతో అతడి స్టార్ డమ్ ఒక్కసారిగా రెట్టింపు అయింది. అదేమీ పాన్ ఇండియా చిత్రం కూడా కాదు. కేవలం రీజనల్ మార్కెట్ తోనే ఆ రేంజ్ లో వసూళ్లు సాధించి సీనియర్ హీరోల్లో ఓ సరికొత్త రికార్డు సృష్టించారు.
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్లు ఉన్నా? వాళ్లెవ్వరూ ఇంకా 300 కోట్ల క్లబ్ లో చేరలేదు. చిరంజీవి, బాలయ్య చిత్రాలకు ఈ రేంజ్ ఉన్నా? ఇంకా వారు కూడా వెనుకబడే ఉన్నారు. ఆ రకంగా సీనియర్ హీరోల్లోనే వెంకీ ముందంజలో కనిపిస్తున్నారు. తాజాగా వెంకటేష్ బాక్సాఫీస్ టార్గెట్ కూడా మారుతుంది. ఇప్పుడతడి ముందున్న టార్గెట్ 500 కోట్ల క్లబ్ లో చేరడం. అందుకు తగ్గట్టే కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో వెంకీ అంతే కేర్ పుల్ గా ఉంటున్నారు.
`శంకర వరప్రసాద్` లో 20 నిమిషాల పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుంది అనీల్ రావిపూడి కావడం..అందులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం కావడంతో? ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందనే అంచనాలైతే ఉన్నాయి. 500 కోట్ల క్లబ్ కే ఆస్కారం లేకపోలేదు. చిరు ఇమేజ్...అనీల్ మ్యాజిక్ వర్కౌట్ అయిందంటే? 500 కోట్లు కూడా పెద్ద విషయమేమి కాదు. కానీ ఇది వెంకీ సోలో ప్రాజెక్ట్ కాదు కాబట్టి? అలా పరిగణించలేం.
ప్రస్తుతం వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. గురూజీ కెరీర్ లో కూడా ఇంకా 300 కోట్ల క్లబ్ లో చేరి చిత్రం ఒక్కటీ లేదు. ఈ నేపథ్యంలో `ఆదర్శ కుటుంబం హౌస్ 47`కు అవకాశాలున్నాయి. ఇదీ రీజనల్ మార్కెట్ ను బేస్ చేసుకుని తెరకెక్కిస్తోన్న చిత్రం. పాన్ ఇండియాలో రిలీజ్ చేయగలిగితే గనుక 500 కోట్లకు కొంత వరకూ అవకాశం ఉండొచ్చు. మరి ఆ దిశగా మేకర్స్ ఆలోచన చేస్తున్నారా? అన్నది తెలియాలి.