రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది
-దగ్గుబాటి పురందరేశ్వరి
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది అని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ రామారావు గారు పేరు ఎప్పటికి నిలిచిపోతుందని, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురందరేశ్వరి పేర్కొన్నారు. ఆడియో రూపంలో రూపొందించిన 1984 ఆగష్టు పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని డిసెంబర్ 13 హైదరాబాద్ FNCC లో నిర్వహించిన కార్యక్రంలో పేర్కొన్న శ్రీమతి పురందరేశ్వరి ముఖ్య అతిధులుగా పాల్గొని ఆడియో ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి మా తెలుగుతల్లికి గీతాలాపన జరిగింది.
జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ టీడీ జనార్దన్ చైర్మన్ గా ఉన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రూపొందించిన సజీవ చరిత్ర పుస్తకం ఆడియో రూపం విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో సీనియర్ రాజకీయనేత, మాజీ మంత్రి శ్రీ మోత్కుపల్లి నరసింహులు, శ్రీ నందమూరి రామకృష్ణ, సినీ నిర్మాత కె ఎస్ రామారావు, బొల్లినేని క్రిష్నయ్య, చైతన్య రాజు, పుస్తక రచయిత విక్రమ్ పూల, ఆడియో పుస్తకానికి గాత్రధారణ చేసిన శ్రీమతి గాయత్రీ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు రామ్మోహన్ రావు, గుమ్మడి గోపాలకృష్ణ, మండవ సతీష్, మధుసూధనరాజు, బిక్కి కృష్ణ, ప్రొఫెసర్ వెంకట్, పర్వతనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ముందుగా రచయిత విక్రమ్ పూల పుస్తక పరిచయం చేశారు.
స్వాగతోపన్యాసం చేసిన కమిటీ చైర్మన్ శ్రీ టీడీ జనార్దన్.. ఎన్టీఆర్ సినీరాజకీయ రంగాల్లో చేసిన కృషిని, ఆయన నెలకొల్పిన ఉన్నత ప్రమాణాలను ప్రస్తావించారు. ఆంధ్రదేశానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించిన అందరికి గుర్తుండిపోయేది ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలుగునాట రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత అన్నట్టుగా పాలనా సాగిందని చెప్పారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని తాము ఎన్టీఆర్ సిద్ధాంతాల భావజాలాన్ని ముందుతరానికి, తర్వాత తరానికి తెలియజెప్పాలని ఉద్దేశ్యంతో కమిటీ ఏర్పాటు చేసారని అందరి సహకార సమన్వయంతో ఎన్టీఆర్ పై పలు పుస్తకాలు వెలువరిస్తున్నామని ప్రత్యేకంగా అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశామని భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపటతామని, ఎన్టీఆర్ పేరుని అజరామరం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీమతి పురందరేశ్వరి కీలకోపన్యాసం చేసారు. 1984 ప్రస్వామ్య పరిరక్షణోద్యమం ఎన్టీఆర్ జీవితంలోనే ప్రధాన సంఘట అని, అంతేకాకుండా దేశ రాజకీయాలను పూర్తిగా మార్చివేసిన రాజకీయ సంఘటన అని అన్నారు. ఈ సంఘటన జరగకముందు దేశంలో పార్టీ ఫిరాయింపులు, ప్రభుత్వాలను పడగొట్టే అనైతిక చర్యలు యదాస్వేఛ్ఛగా జరిగేవని, అయితే ఎన్టీఆర్ ఆయనకు మద్దతు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షాలు, మీడియా, ప్రజాస్వామ్య వాదులు చేసిన పోరాటం వల్ల 1985 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల వ్యతిరేఖ చట్టం అమలులోకి వచ్చిందని గుర్తు చేసారు. ఎన్టీఆర్ భావజాలాన్ని నలుదిక్కుల వ్యాపింపజేస్తున్న.. ఎన్టీఆర్ కమిటీ లిటరేచర్ సభ్యులకు చైర్మన్ టీడీ జనార్దన్ కు కృతఙ్ఞతలు తెలిపారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంట్ లో ఏర్పాటు చేయించడంలో, ఎన్టీఆర్ పేరిట బంగారు నాణెం విడుదల చేయించడంలో తన వంతు కృషి చేశాను అని, కొంతమేర నాన్నగారి రుణాన్ని తీర్చుకోగలిగాను అని తెలిపారు.
సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అతి సామాన్యుడైన తనను రాజకీయంగా ప్రోత్సహించడం వల్లే ఆరు పర్యాయములు ఎమ్యెల్యే ను కాగలిగానని, మంత్రిని కాగలిగాను అని, పేదరికాన్ని ముద్దాడిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని, పేదోళ్ల ఆకలి గురించి, సంక్షేమం గురించి ఆలోచించిన ఎన్టీఆర్ తన గుండెల్లో ఎప్పటికి నిలిచి ఉంటారని అన్నారు.
ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ 1984 ఆగష్టు నాటి రాజకీయ పరిస్థితులు తమ కుటుంబాన్ని ఏ విధంగా ఆవేదనకు గురి చేశాయో గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తమ మాతృమూర్తి క్యాన్సర్ తో బాధపడుతుందని తండ్రి అమెరికా లో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చిన సమయంలో పదవీత్యుత్తుల్ని చేసారని, విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించినా ప్రజల్లోకి వెళ్లి ప్రజాస్వామ్య పోరాటం చేసినట్లు తెలిపారు. కాగా సజీవ చరిత్ర గాత్రధారణ చేసిన శ్రీమతి గాయత్రిని శ్రీమతి పురందరేశ్వరి, టీడీ జనార్దన్ సత్కరించారు. ఈ కార్యక్రంలో ఎన్టీఆర్ అభిమానులు ఇతర సినీ పెద్దలు వందలాదిగా పాల్గొని విజయవంతం చేసారు.