దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఏం ప్లాన్ చేసినా అది ఎంతో విజువల్ గ్రాండియారిటీతో ఉంటుంది. ఇటీవల వారణాసి టైటిల్ గ్లింప్స్ వేడుకను ఆర్.ఎఫ్.సిలో రాజీ అన్నదే లేకుండా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. 130 అడుగుల ఐమ్యాక్స్ స్క్రీన్ పై తన సినిమా టైటిల్ ని లాంచ్ చేయాలని `గ్లోబ్ ట్రాటర్ 2025` పేరుతో భారీ ఈవెంట్ ని ప్లాన్ చేసిన తీరు నభూతోనభవిష్యతి. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ఏకంగా వారణాసి సెట్ వేసి, స్టేజీ కోసమే కోట్లు ధారపోసారు.
ఇదంతా ఒకెత్తు అనుకుంటే స్టేజీపై తన సినిమా కథానాయకుడి ఎంట్రీ కోసం ఇచ్చిన ఎలివేషన్ మరో లెవల్ అని చెప్పాలి. మహేష్ శూలం ధరించి వృషభంపై ప్రయాణించే ఆ ఒక్క విజువల్ కోసం జక్కన్న కళాదర్శకుడితో కలిసి ఎంతగా శ్రమించారో తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో చెబుతోంది. ఈ వీడియో చూశాక ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదని అంగీకరించాలి. సుమారు వందమంది టెక్నీషియన్లు దీనికోసం రోజుల తరబడి ఎంతగా శ్రమించారో అర్థమవుతోంది.
సాంకేతిక కారణాలతో ఈవెంట్ లో అనుకున్నది జరగకపోతే, రాజమౌళి అసహనానికి గురయ్యారు. ఆయన దేవుడిని అవమానించాడంటూ చాలా తిట్టారు. కానీ రాజమౌళి శ్రమను చూస్తే అసలు అనాల్సిన అవసరం ఏం ఉంది? అని అంటారు. తన హీరోని ఎలివేట్ చేసేందుకు ఆయన పడిన తపనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. మహేష్ అలా రాజసంతో నందీశ్వరుడిపై వేదికపైకి వస్తుంటే, కరతాళ ధ్వనులతో అభిమానులు స్వాగతించిన తీరు ఎంతో గొప్పగా ఉంది. వారణాసి 2026-27 సీజన్ మోస్ట్ అవైటెడ్ మూవీగా బరిలోకి వస్తోంది. కేవలం ప్రమోషన్స్ కోసమే రాజమౌళి ఇంత భారీగా ప్లాన్ చేసారంటే, సినిమాని ఇంకెంత విజువల్ గ్రాండియారిటీతో అందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాని కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా దూసుకెళుతోంది.