200 కోట్ల స్కామర్ సుఖేష్ చంద్రశేఖర్ పై నమోదైన కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. జాకీకి కోర్టు ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్‌ను కొట్టివేయాలనే విజ్ఞప్తిని తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు జూలై 3న ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ జాక్వెలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుకేష్‌ని టార్గెట్ చేస్తే తాను బాధితురాలిగా మారానని కూడా జాకీ వాదించింది. తీహార్ జైలు అధికారులు సుకేష్‌కు మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను యాక్సెస్ ఇచ్చారని ఈడీ స్వయంగా అంగీకరించిందని పిటిషన్‌లో పేర్కొంది. సుకేష్ జాకీ సహా సినీ పరిశ్రమలోని చాలామందిని మోసం చేశాడని ఆరోపించారు. ఈ నేరంలో నేను ప్రాసిక్యూన్ సాక్షిని అని పేర్కొంది. తనపై తదుపరి చర్యలను రద్దు చేయాలని వాదించింది.
అయితే జాక్విలిన్ మాత్రం ఉద్ధేశ పూర్వకంగా నేరం చేసిందనేది కోర్టు అభియోగం. సుకేష్ గురించి సర్వం తెలిసే తప్పు చేసింది. కానీ సుకేష్ నేర నేపథ్యం గురించి తనకు తెలియదని, ఈ ఆరోపణలు అవాస్తవమని జాక్వెలిన్ వాదించింది. కానీ ఈడీ ప్రకారం.. జాక్వెలిన్ సుఖేష్ నుండి దాదాపు రూ.7 కోట్ల విలువైన విలాసవంతమైన బహుమతులు అందుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ బహుమతులు రూ.200 కోట్ల మోసం ద్వారా వచ్చిన నేరపూరిత ఆదాయంలో భాగమని ఏజెన్సీ వాదిస్తోంది.
రాన్ బాక్సీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మల్వీందర్ సింగ్ లను 200 కోట్ల మేరకు ముంచిన చంద్రశేఖర్ తీహార్ జైలులో ఉన్నప్పుడు పలువురు ఉన్నత స్థాయి వ్యక్తులను మోసం చేసినట్లు కథనాలొచ్చాయి. సుప్రీం కోర్టు పిటిషన్‌ను కొట్టివేయడంతో, జాక్వెలిన్ ఇప్పుడు మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కోవలసి ఉంటుంది. అసలు ఏ ఉద్ధేశంతో జాక్విలిన్ కానుకలు అందుకుందో తదుపరి విచారణలో నిగ్గు తేలుస్తారు.