సినీజోష్ రివ్యూ : మిరాయ్
నిర్మాణ సంస్థ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు : తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరన్, జగపతిబాబు, జయరామ్ తదితరులు
ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్
సంగీతం: గౌర హరి
నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కీర్తి ప్రసాద్
సినిమాటోగ్రఫీ, రచన, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
విడుదల తేదీ : 12-09-2025
గత చిత్ర ఫలితాన్ని మరిచి మరీ మరింత కష్టపడ్డ
తేజ సజ్జ ఆశలన్నీ మిరాయ్ తో మస్తుగా తీరాయ్.
తొలి చిత్రానికి మిస్సయిన విజయాభినందనలు
కార్తీక్ చెంతకు వెల్లువలా మిరాయ్ తో వచ్చి చేరాయ్.
ఈ చిత్రంతో ఖచ్చితంగా హిట్టు కొట్టి తీరాలనే పట్టుదలతో
విశ్వప్రసాద్ చేసిన ప్రయత్నాలన్నీ మిరాయ్ తో నెర వేరాయ్.
నిజానికి మిరాయ్ అనే టైటిల్ జనానికి అర్ధం కాకున్నా టీజర్, ట్రైలర్ అందరినీ అమితంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంతటా ఆసక్తి పెరుగుతూ వచ్చింది.. కొంచెం మంచి అంచనాలను పెట్టుకోవచ్చనే భరోసా కలిగింది. అందుకు తగ్గట్టే నేడు విడుదలై వీక్షకులను విశేషంగా అలరిస్తూ, యునానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకుంది మిరాయ్. మరి మార్నింగ్ షో నుంచే బాక్సాఫీస్ వద్ద మిఠాయిలా మారిపోయిన ఈ మిరాయ్ సంగతి ఏమిటో, ఇంత సందడి ఎందుకో సరదాగా సమీక్షించుకుందాం !
చందమామ కథ నచ్చునోయ్.. ఆబాలగోపాలమూ మెచ్చునోయ్.!
సమ్రాట్ అశోక చక్రవర్తి కళింగ యుద్ధ విధ్వంసం తరువాత పశ్చాత్తాపంతో తాను వెలువరించిన తొమ్మిది గ్రంధాల సంరక్షణను తొమ్మిదిమంది యోధులకు అప్పగిస్తాడు. అప్పట్నుంచీ ఆ యోధుల వారసులు సైతం వాటిని కాపాడుకుంటూ వస్తారు. అయితే ఇన్ని శతాబ్దాల తరువాత ఆ గ్రంధాల విశిష్టతను తెలుసుకున్న మహావీర్ లామా (మంచు మనోజ్) అనే దుష్టుడు వాటిని చేజిక్కించుకునే క్రమంలో గ్రంథ రక్షకులను సంహరిస్తూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఎనిమిది గ్రంధాలను వశం చేసుకుంటాడు. ఇక అమరత్వం కూడా పొంది జగతినే శాసించే స్థాయి దక్కాలంటే తొమ్మిదో గ్రంధం తనకి చిక్కాల్సి ఉంటుంది. కానీ అనాథలా పెరిగి, అల్లరి చిల్లరగా తిరిగే వేద (తేజ సజ్జ) తన తల్లిని కలుసుకోవడం, తన బాధ్యత తెలుసుకోవడంతో పోరు ఆరంభమవుతుంది. తంత్ర శక్తులు కలిగిన మహావీర్ ని వేద ఎలా నిలవరించాడు, మిరాయ్ అనే ఆయుధాన్ని ఎలా సంపాదించాడు, యోధుడిలా మారి మహావీర్ తో ఎంతగా పోరాడాడు అన్నదే మిరాయ్ మ్యాటర్. అశోకుడు, కళింగ యుద్ధం అనే హిస్టారికల్ పాయింట్స్ కి, శ్రీ రాముడు సృష్టించిన ఆయుధం మిరాయ్ అనే మైథలాజికల్ టచ్ ఇచ్చి ఓ చందమామ కథలా మిరాయ్ ని మలిచారు. అయితేనేం, ఆసక్తిగా అనిపించే ఘట్టాలను, అబ్బురపరిచే దృశ్యాలను రంగరించారు కనుక ఆ చందమామ కథే నచ్చేస్తోంది. ఆబాలగోపాలమూ మెచ్చేస్తోంది.
కథనం కామనేనోయ్.. కదన రంగాన మాత్రం కదం తొక్కునోయ్.!
తంత్రాలతో, కుతంత్రాలతో లోకాన్ని ఏలాలని కలలు కనే దుర్మార్గుడికి, ఆ దుష్ట చర్యలను అంతం చేసేందుకు వీరోచితంగా పోరాడే ధీరోదాత్తుడికి మధ్య సాగే కథని రకరకాల రూపాల్లో దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. అందుకే మిరాయ్ కథనం కూడా కొందరికి కామన్ గానే అనిపిస్తుంది. అయితే అలా వాదించే వారి చేత కూడా వహ్వా అనిపించేలా ఉన్నాయి మిరాయ్ లోని యాక్షన్ బ్లాక్స్. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సంపాతి ఎపిసోడ్, క్లయిమాక్స్ లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ యాక్షన్ ప్రియులకు ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. అలాగే మిరాయ్ శక్తిని గ్రహించి వేద - యోధగా మారి చేసే ఫైట్ పిల్లలకు బాగా నచ్చుతుంది. ఇక కథానాయిక పాత్రను కాలక్షేపానికి కాకుండా కథతో ముడిపెట్టడం, ప్రతి ముఖ్య పాత్రకూ ఓ పరమావధి ఉండేలా చూసుకోవడం మిరాయ్ కి ప్లస్ అయ్యాయి. కామెడీ కోసం క్రియేట్ చేసిన ట్రాక్ మాత్రం ట్రాక్ తప్పగా, వైరల్ అయిన వైబ్ ఉందిలే పాటకు సినిమాలో చోటు లేకపోవడం లోటుగా అనిపించింది. కానీ టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పుడే కథా నేపథ్యాన్ని వివరించే ప్రభాస్ వాయిస్ ప్రేక్షకులకు ఒక స్వీట్ సర్ ప్రైజ్. క్లయిమాక్స్ లో శ్రీ రామచంద్రుని ఘట్టం అయితే అస్సలెవ్వరూ ఊహించని అపురూపం.
కలిసి కదిలారోయ్.. ది బెస్ట్ వదిలారోయ్.!
లెక్కకు మిక్కిలి లొకేషన్లు. భారీ యాక్షన్ సీక్వెన్సులు. విరివిగా అవసరం పడే CG షాట్లు. వీటన్నిటికీ బడ్జెట్ కేలిక్యులేషన్లు. కానీ కసి కసిగా ఉన్న మిరాయ్ టీమ్ కలిసి కదిలింది. ది బెస్ట్ తెర పైకి తెచ్చింది. వేద - యోధ రెండు కోణాల్లోనూ రాణించాడు తేజ సజ్జ. అందరూ అతడిని సూపర్ హీరో అంటున్నా తనకి మాత్రం సూపర్ పెర్ ఫార్మర్ అనిపించుకోవాలనే తపనే ఎక్కువ. అందుకే పాత్రోచితంగా కనిపించాడే తప్ప పరిధిని మించి హనుమాన్ హ్యాంగ్ ఓవర్ ని ఎక్కడా చూపించలేదు. సరైన పాత్ర దొరికితే తన సామర్ధ్యం చాటుకోవాలని ఉవ్విళ్లూరుతోన్న మంచు మనోజ్ కి మంచి అవకాశం మిరాయ్ రూపంలో దొరికింది. డైలాగ్స్ లో పెద్ద పస లేకున్నా తన డైలాగ్ డెలివరీతో వాటికి పదుకు పెట్టాడు. రితికా నాయక్ కి అర్ధవంతమైన పాత్ర లభించింది. అంబిక పాత్రలో శ్రీయ నిండుగా అమరింది. జగపతిబాబు, జయరామ్ ల అనుభవం వారి పాత్రలకు ప్రాముఖ్యతను ఆపాదించింది. నటులుగా కనిపించిన దర్శకులు కిషోర్ తిరుమల, వెంకటేష్ మహాలతో పాటు గెటప్ శ్రీను కూడా వినోదాన్ని పంచడంలో విఫలం అయ్యాడు.
ప్రతిభావంతులోయ్.. ప్రశంసలకు అర్హులోయ్.!
మిరాయ్ సినిమాకు సంబంధించి సాంకేతిక వర్గాన్ని ప్రత్యేకంగా అభినందించి తీరాలి. ఆర్ట్, కాస్ట్యూమ్స్, మేకప్.. ఇలా అన్ని విభాగాల్లోనూ అంకితభావం కనిపించింది. సీనియర్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ పెద్ద ఎస్సెట్ అయ్యారు. అలాగే గౌర హరి నేపథ్య సంగీతం మిరాయ్ ని మరో స్థాయికి చేర్చింది. అలాగే VFX టీమ్ వంకలు వెతికే వీలు ఇవ్వకుండా వీక్షకులను ఆశ్చర్యపరిచే అవుట్ ఫుట్ ఇచ్చింది. అలాగే కథని నమ్మి ఖర్చుకి వెనుకాడకుండా ముందడుగు వేసిన మిరాయ్ మేకర్ టి.జి.విశ్వప్రసాద్ జడ్జిమెంట్ కీ, గట్స్ కీ ఈ దిగ్విజయ ఫలితం సముచితం. ఇక కార్తీక్ ఘట్టమనేని, దర్శకుడిగా తన తొలి చిత్రానికి ఆశించిన ఫలితం రాలేదనే అక్కసుని, ఆ కసిని మిరాయ్ లో తెరనిండా చూపించారు. రచయితగా రాణించి, కెమెరా మెన్ గా విజృంభించి, దర్శకుడిగా తన విజన్ నీ, విగర్ నీ చాటుకున్న కార్తీక్ ని ఇక ఇండస్ట్రీ విడిచిపెట్టదు. మెగా ఫోన్ వదిలిపెట్టదు.
ఇది మిరాయ్ జోరోయ్.. ఇక కలెక్షన్ల హోరోయ్.!
vibe సాంగ్ తో బాటు నిధి అగర్వాల్ పై చిత్రీకరించిన మరో స్పెషల్ సాంగ్ ని కూడా కథనానికి అవరోధమని పక్కన పెట్టేసిన మిరాయ్ టీమ్ సినిమాపై వున్న క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు టికెట్ రేట్లను పెంచే ప్రయత్నమూ చేయలేదు. ప్రభాస్ వాయిస్ ఓవర్ వుందనే ప్రచారంతో ఓపెనింగ్స్ కి ప్లాన్లు వెయ్యలేదు. ఆ సిన్సియారిటీయే ఇప్పుడు గ్రాండ్ సక్సెస్ ని పొందుతోంది. ఈ మధ్య కాలంలో మిరాయ్ లా అంచనాలను అందుకుని అన్ని వర్గాలనుంచీ, అన్ని వైపులనుంచీ హిట్ టాక్ పొందిన చిత్రం మరేదీ లేదంటున్నారు విశ్లేషకులు. రిపోర్ట్స్ సూపర్ గా ఉన్నాయి. రివ్యూస్ ఫేవర్ గా వచ్చాయి. టికెట్ రేట్లు అందుబాటులో ఉన్నాయి. హాలిడేస్ మొదలవుతున్నాయి. ఇక పిన్నల నుంచీ పెద్దల వరకూ అందరికీ నచ్చే మిరాయ్ వంటి చిత్రం జోరు, కలెక్షన్ల హోరు ఎలా ఉంటుందో, బాక్సాఫీస్ వద్ద మిరాయ్ సృష్టించే మిరకిల్స్ యే రేంజ్ లో ఉంటాయో ముందు ముందు తేలనుంది.
పంచ్ లైన్ : మిరాయ్.. వెరీ వెల్ మేడ్ మిఠాయ్ !
సినీజోష్ రేటింగ్ : 3.25/5