క్రికెటర్ గా ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడిన ఎం.ఎస్.ధోని, ఇప్పుడు హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. అతడు హీరోగా నటించాడా లేక వాణిజ్య ప్రకటనా? అనేది తెలియదు కానీ, తాజాగా వాసన్ బాలా దర్శకత్వం వహించిన `ది ఛేజ్` టీజర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఎం.ఎస్.ధోని తన సహచరుడు ఆర్.మాధవన్‌తో కలిసి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చిన తీరు షాకిస్తోంది. ధోని స్టైలిష్ అవతార్ మైండ్ బ్లాక్ చేస్తోంది. ధోని- మాధవన్ జోడీ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లుగా స్టైలిష్ గా కనిపిస్తున్నారు టీజర్‌లో.
అసలు ఇది సినిమా టీజరేనా? లేక బాలా ఏదైనా యాడ్ షూట్ చేసారా? ఒకవేళ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారా? అంటూ జనం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్నిటికీ తొందర్లోనే ధోని సందేహ నివృత్తి చేస్తాడనే భావిద్దాం. మాధవన్ ఈ టీజర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వెంటనే, ఇది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. వందలాది మంది అభిమానులు వెంటనే వీడియోను షేర్ చేయడం ప్రారంభించారు. ధోని నటనా రంగప్రవేశం గురించి చర్చ తీవ్రమైంది. ధోని ఇప్పటికే చాలా ప్రకటనలలో కనిపించాడు. ఇటీవల తమిళ చిత్రం `గోట్`లో అతిధి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు రిలీజైన ది ఛేజ్ టీజర్ లో ఒక ప్రొఫెషనల్ నటుడిలాగా స్టైలిష్ గా కనిపించాడు. గన్స్ తో గ్యాంగ్ స్టర్లను ఛేజ్ చేసే కాప్ పాత్రలో అద్భుతంగా కనిపించాడు. ఈ టీజర్ చూడగానే మహి చివరకు తన నటనా రంగ ప్రవేశం చేస్తున్నాడా? అని వాసన్ పోస్ట్ కింద ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రాశారు. ఇది సినిమా అయితే చాలా బావుంటుందని మరొక యూజర్ రాశారు.