హైదరాబాద్ లోని ఫిలింస్టూడియోస్ లో సారథి స్టూడియోస్ అత్యంత పురాతనమైనది. పద్మాలయా స్టూడియోస్, శబ్ధాలయా స్టూడియోస్, రామకృష్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్.. ఇవన్నీ మద్రాసు నుంచి హైదరాబాద్(ఆంద్రప్రదేశ్) కి సినీపరిశ్రమ తరలి రావడంలో సహకరించిన స్టూడియోస్. ప్రముఖ కథానాయకులు, నిర్మాతలు హైదరాబాద్ లో స్టూడియోల నిర్మాణానికి కృషి చేయడం, అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పూర్తి స్థాయి సహాయసహకారాలు అందించడంతో పరిశ్రమ నెమ్మదిగా మద్రాసు నుంచి హైదరాబాద్ కి షిఫ్టయింది. అప్పటికి హైదరాబాద్ అంతగా అభివృద్ధి కూడా చెందలేదు.
అయితే హైదరాబాద్ లో ప్రతిష్ఠాత్మకంగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించడానికి అసలు కారణం అగ్ర కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు, నిర్మాత అక్కినేని వెంకట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అప్పట్లోనే ఏఎన్నార్ తీవ్రమైన గుండె నొప్పికి అమెరికాలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అదే సమయంలో ఆయన కోలుకున్న తర్వాత `మహా కవి క్షేత్రయ్య` అనే సినిమాని ప్రారంభించారు. కానీ సారథి స్టూడియోస్ లో షూటింగుకి అనుమతి లభించలేదు. దీంతో అక్కినేని షూటింగుల కోసం బెంగళూరు లేదా చెన్నైకి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ దానికి ససేమిరా అనుకున్న అక్కినేని ఏం చేయాలో తన పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేనిని అడిగారు. దానికి స్పందనగా అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావును సంప్రదించిన వెంకట్ వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ కి శంకుస్థాపన చేసారు. స్టూడియో నిర్మాణం కోసం జలగం అన్నివిధాలుగా అక్కినేని కుటుంబానికి సహకరించారు. అలా హైదరాబాద్ వెంకటగిరి సమీపంలో కేబీఆర్ పార్క్ దిగువన అన్నపూర్ణ స్టూడియోస్ ఒక కొండపై నిర్మితమైంది. అప్పటికి ఆ ప్రాంతం తుప్పలు- డొంకలు, కొండ రాళ్లతో ఎందుకూ పనికిరానిదిగా ఉంది. కానీ దానిని స్టూడియోగా రూపాంతరం చేసాక ఆ ప్రాంతం ఎంతో అందంగా శోభాయమానంగా మారింది.
అసలు అక్కినేనికి సారథి స్టూడియోస్‌తో వచ్చిన చిక్కులేమిటి? అంటే.. అప్పట్లోనే ఒక కొత్త దేవదాస్ (ఘట్టమనేని కృష్ణ నటించినది) సినిమాని రిలీజ్ చేసారు. ఆ సమయంలో అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అక్కినేని నటించిన పాత క్లాసిక్ `దేవదాసు`ను దానికి పోటీగా రిలీజ్ చేసారు. అక్కినేని దేవదాస్ ఏకంగా వంద రోజులు ఆడింది. దీంతో కొత్త దేవదాస్ కర్తలు అక్కినేనిపై కక్ష కట్టారని వెంకట్ వెల్లడించారు. దాని కారణంగానే సారథి స్టూడియోస్ ని అక్కినేని షూటింగుల కోసం ఇవ్వలేదని తెలిపారు. సారథి స్టూడియోస్ అప్పట్లో కృష్ణ తాలూకా వాళ్లు నియంత్రించేవారు! ఆ రోజు ఆ పంతం పట్టుదల పుట్టకపోతే, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం జరిగి ఉండేది కాదేమో!!